వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 4,411 కోట్ల టీటీడీ బడ్జెట్ ఉంటుందని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌తో పోలిస్తే 43 శాతం అధికంగా ఉన్నది. హుండీ కలెక్షన్లు పెరుగుతున్నందునే బడ్జెట్ అంచనాను పెంచినట్టు ఆయన వివరించారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 4,411 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ సారి బడ్జెట్ అంచనాలు 43 శాతం పెరిగాయి. 1933లో టీటీడీ మొదలైనప్పటి నుంచి అత్యధిక భారీ బడ్జెట్ అంచనా ఇదే కావడం గమనార్హం.
ఈ బడ్జెట్‌ను తితిదే ధర్మకర్తల మండలి ఫిబ్రవరిలోనే ఆమోదించింది. కానీ, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిల కోడ్ కారణంగా ఈ బడ్జెట్‌ను వెల్లడించలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి తెలిపారు. ఈ బడ్జెట్‌ను ప్రభుత్వ ఆమోదించిందని వివరించారు.
టీటీడీ బడ్జెట్ అంచనా భారీగా పెరగడానికి హుండీ కలెక్షన్లు కారణం అని వైవీ రెడ్డి చెప్పారు. బ్యాంకుల్లోని టీటీడీ డిపాజిట్ల మీద కూడా రాబడి పెరిగిందని వివరించారు. వడ్డీ రూపంలో రూ. 900 కోట్లు వస్తాయని, ఆన్‌లైన్ సేవా స్కీం ద్వారా రూ. 100 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా సమయంలో ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ సేవాను ఇక పైనా కొనసాగిస్తామని వివరించారు. గత ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ. 3,096 కోట్లుగా ఉన్నది.
Also Read: హిండెన్‌బర్గ్ మరో సంచలనం.. ఇంకో బిగ్ రిపోర్టుతో వస్తున్నామంటూ ట్వీట్.. ఈసారి ఎవరికి మూడిందో..?
ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 500 కోట్లు, దర్శన టికెట్ల ద్వారా రూ. 330, ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ. 140 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనాలు పొందుపరిచినట్టు ఆయన తెలిపారు. కళ్యాణ మండపం ద్వారా రూ. 129 కోట్లు, తలనీలాల ద్వారా రూ. 126 కోట్లు వస్తాయని అంచనా వేశారు.
ఇదిలా ఉండగా మానవ వనరులకు రూ. 1532 కోట్ల పేమెంట్లు, రూ. 690 కోట్ల మెటీరియల్ కొనుగోళ్లకు వ్యయం అవుతాయని వివరించారు.
