తిరుపతి: హిందువుల వైకుంఠమైన తిరుమల పవిత్రత గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని... అయితే ఆ వర్గం మనోభావాలను అర్థంచేసుకోలేని ముఖ్యమంత్రి జగన్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం, అధికారులు కలిసి ఈ పవిత్రమైన క్షేత్రాన్ని వ్యాపారకేంద్రంగా మార్చేశారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు.  తిరుమల శ్రీవారికి భక్తలు సమర్పించే తలనీలాలను కూడా స్మగ్లింగ్ చేయడం... పట్టుబడితే తమకు సంబంధం లేదని చెప్పడం దారుణమన్నారు. 

''తిరుమల పవిత్రతను, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ముఖ్యమంత్రి ప్రవర్తించడం బాధాకరం. భక్తులు నిష్టతో పవిత్రంగా స్వామివారికి సమర్పించే తలనీలాను ఎక్కడో రక్షణశాఖవారు పట్టుకుంటే మాకేం సంబంధమని టీటీడీ అనడం సిగ్గుచేటు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పువ్వుని కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. తలనీలాలు కాంట్రాక్ట్ పొందిన సంస్థ పూర్వాపరాలేమిటి, వారికున్న అర్హతలేమిటి, వాటిని తీసుకెళ్లి వారు ఎక్కడ ఏంచేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై లేదా? ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖామంత్రికి జరిగిన ఘటన పట్టదా? టీటీడీలో పనిచేసిన ఎంతోమంది ఈవోలు, జేఈవోలు,  తిరుమల పవిత్రత కాపాడేలా పనిచేసేవారు. ఇప్పుడున్నవారు జగన్మోహన్ రెడ్డికి బ్రోకర్లుగా పనిచేయడానికి వచ్చారా?'' అని మండిపడ్డారు.

''స్పెషల్ జీవోతో అడిషనల్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి, ముఖ్యమంత్రికి బ్రోకర్ గా పనిచేయడానికి వచ్చారా? పాలకవర్గంలో వ్యాపారులు, స్మగ్లర్లు, క్రిమినల్స్ , ఎర్రచందనం అమ్మేవారిని నియమించారు. టీటీడీని వ్యాపారకేంద్రంగా మార్చారు. తలనీలాల ఘటనపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పాలకవర్గాన్ని తక్షణమే రద్దుచేయాలి. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఇతర అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. కపట నాటకాలతో హిందువులను మోసగించే పనులు చేయకుండా ముఖ్యమంత్రి తనచిత్తశుద్ధిని నిరూపించుకోవాలి'' అని సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. 

read more   శ్రీవారి భక్తుల తలనీలాల వివాదం... ఆ సంస్థలపై కేసులు నమోదు

''తన పాలనలో ముఖ్యమంత్రి తిరుమలను ఎంతలా అప్రతిష్టపాలుచేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేరే మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతి ఏడుకొండలను ఐదుకొండలకు కుదించాలని చూశాడు. అదృష్టమో, దురదృష్టమో తెలియదుగానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రయ్యాడు. తిరుమల స్వామివారి తలనీలాలు మయన్మార్ నుంచి చైనా కు పోతుంటే, రక్షణశాఖ వారు పట్టుకుంటే కేసులు పెడతామని ధర్మారెడ్డి చెబుతున్నాడు. ఎవరిపై కేసులు పెడతాడో చెప్పాలి. తిరుమల వేంకటేశ్వరుడిని భ్రష్టు పట్టించింది చాలక, పాలకవర్గాన్ని నాశనం చేసింది కాక కేసులుపెడతామంటారా?'' అని మండిపడ్డారు.

''తలనీలాల కాంట్రాక్టు పొందిన సంస్థ గురించి టీటీడీ అధికారులకు తెలియదా? జరిగిన ఘటనకు ధర్మారెడ్డిని బాధ్యుడుని చేసి అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రి వెంటనే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. పాలకవర్గమంతా ఏంచేస్తుందో ఛైర్మన్ వై.వీ.సు బ్బారెడ్డి సమాధానం చెప్పాలి. తన స్వప్రయోజనాల కోసం సుబ్బారెడ్డి పాలకవర్గాన్ని అప్రతిష్టపాలు చేశాడు. చరిత్రలో ఇదివరకు దేవాలయాలను ధ్వంసంచేయాలని చూసినవారు తిరుపతి పరిసరప్రాంతాలకు కూడా చేరలేకపోయారు. వారితో పోల్చుకుంటే ఈ ముఖ్యమంత్రి ఎంత?'' అని అన్నారు. 

''హిందూ సంస్థలను అడ్డుపెట్టుకొని కోట్లు సంపాదిస్తున్న ముఖ్యమంత్రికి ఏదో ఒకనాడు తగినశాస్తి జరుగుతుంది. తిరుమల క్షేత్రంలో గాలి, నీరు, చెట్టు, చేమ, ఆకు, పువ్వు అన్నీ పవిత్రమైనవే. తలనీలాల  ఘటనకు కారకులైన జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి లను ముఖ్య మంత్రి తక్షణమే పదవినుంచి తొలగించి, వారిని అరెస్ట్ చేయించాలి. వెంటనే టీటీడీ పాలకవర్గాన్ని రద్దుచేయాలి . తిరుమలలో జరిగే అన్యమత ప్రచారాన్ని నిరోధించాలి'' అని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.