తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా టిటిడిపై ఫేస్ బుక్, వివిద మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై మంగళవారం రాత్రి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
       
టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన   రామ రాజ్యం మళ్లీ మొదలైంది, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్, గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ అనే సోషల్ మీడియా అకౌంట్లపైనే కాకుండా ఓ మీడియా సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా ఫేస్ బుక్ లో పోస్టు లు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు.

read more  మయన్మార్ సరిహద్దులో తిరుమల తలనీలాలు: టీటీడీ స్పందన ఇదీ...

మిజోరాంలో పట్టుబడిన తలనీలాలు టీటీడీకి చెందినవి కావని ఇప్పటికే కస్టమ్స్ శాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఐజ్వాల్ నుంచి మయన్మార్‌కు అక్రమంగా తలనీలాలు వెళ్తున్నట్లు గుర్తించారు అధికారులు. దాదాపు 3,240 కేజీల తలనీలాలను అస్సాం రైఫిల్స్ స్వాధీనం చేసుకుంది. గత నెల 7న మిజోరాంలోని చుంగ్టే వద్ద స్మగ్లింగ్ చేస్తున్న తలనీలాలను సీజ్ చేశాయి. స్మగ్లర్ల నుంచి తలనీలాలు, లారీలను స్వాధీనం చేసుకున్నాయి అస్సాం రైఫిల్స్.

అయితే ఇవి టీటీడీకి చెందినవేనంటూ ప్రచారం జరిగింది. అయితే అవి తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినవి కావని కస్టమ్స్ తన రిపోర్ట్‌లో పేర్కొంది. ఏపి నుంచి రూ. 18 లక్షల విలువైన తలనీలాలు తరలించే అవకాశం లేనట్లేనని కస్టమ్స్ పేర్కొంది.

మయన్మార్, మిజోరాం మధ్య ఫ్రీ మూవ్‌మెంట్ ఏరియా వుంది. 20 కి.మీ పరిధిలో పాస్‌పోర్ట్, వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం వుంది. ఈ ప్రాంతం గుండా మయన్మార్ దేశానికి అక్రమంగా తలనీలాల తరలింపు జరిగింది. మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో పోలీసులు సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలు ( వెంట్రుకలతో) తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

టీటీడీ తన వద్ద ఉన్న తలనీలాలను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తుంది. టెండర్ లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్ నుంచి జిఎస్ టి కట్టించుకుని తలనీలాలు అప్పగిస్తారు. కొనుగోలు చేసిన బిడ్డర్ కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా ? లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదు. దేశంలోని అనేక ఆలయాలలో తలనీలాల విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే టీటీడీ కూడా ప్రతి మూడు నెలలకోసారి ఈ టెండర్ ద్వారా తలనీలాలు విక్రయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. సంబంధిత అధికారులు తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే బ్లాక్ లిస్ట్ లో పెడతాం అని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.