తెలంగాణ ప్రాంతంలోని బిసిల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఏపిలో కూడా ఈ సామాజిక వర్గాలకు నాయకత్వం వహించడానికి సిద్దంగా వున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకే బిసిలు మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడుతోందని తలసాని పేర్కొన్నారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నానని...అలా ఎదగాలనుకునే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తలసాని స్పష్టం చేశారు. 

కృష్ణా జిల్లా భీమవరంలో జరిగే సంక్రాంతి వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. అక్కడ టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ సామాజిక వర్గానికి తగినన్ని సీట్లిచ్చి గౌరవిచారని ప్రశంసించారు.

అయితే ఏపిలో మాత్రం అలాంటా పరిస్థితులు లేవని...యాదవ సామాజిక వర్గానికి చెందిన అతి తక్కువ మంది రాజకీయాల్లో వున్నారన్నారు. ఇలా ఇళ్లల్లో కూర్చొంటే రాజకీయ అవకాశాలు రావని...మనవారిని సంఘటితం చేసి రాజకీయంగా ఎదగాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో యాదవులు సంఖ్యా బలం ఏంటో చూపించాలని తలసాని పేర్కొన్నారు. 

ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని...ఇలా ముందుకొచ్చేవారి రాజకీయ ఎదుగుదలకు తాను అండగా ఉంటానని తలసాని హామీ ఇచ్చారు. ఏపీలోని రాజకీయ పార్టీలు బీసీలకు పప్పు బెల్లాలు పెట్టి పంపేస్తున్నాయని...చట్ట సభల్లో మాత్రం అవకాశం ఇవ్వడంలేదని ఆరోపించారు. తమకు అవకాశం ఇవ్వకుంటే ఎవరినైనా ఓడించాలని తలసాని పిలుపునిచ్చారు. 


ఈ రాష్ట్రంలో బీసీలకు ఆదరణ లేదని... ప్రభుత్వం కేవలం బీసీలకు అండగా ఉన్నామంటూ ప్రచారం మాత్రమే చేసుకుంటోందని తలసాని ఆరోపించారు. అత్యధికంగా వున్న వారి ఓటుబ్యాంకు కోసమే ప్రభుత్వం ఆ పని చేస్తోందన్నారు. కాబట్టి అలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఇక్కడ కూడా యాదవ సామాజిక వర్గానికి , బిసిలకు నాయకత్వం వహించడానికి తాను సిద్దంగా వున్నానని  తలసాని వెల్లడించారు.