రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఉండే నెల్లూరు జిల్లా కావలిలో ఎన్నికలకు ముందే హీట్ కనిపిస్తోంది. ఇక్కడి నుంచి బరిలో నిలవాలని ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఊవ్విళ్లూరుతున్నారు. తాజాగా జనసేన పార్టీ నుంచి కాంట్రాక్టర్ పసుపులేటి సుధాకర్ తాను కావలి బరిలో ఉన్నట్లుగా తెలిపారు.

బోగులు పంచాయతీ పరిధిలోని చెంచులక్ష్మీపురానికి చెందిన సుధాకర్ కొన్నేళ్ల క్రితం తాపీ మేస్త్రీగా పనిచేస్తూ ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. కాలక్రమంలో త్రిపురా కన్‌స్ట్రక్సన్స్ అధినేతగా, బడా కాంట్రాక్టర్‌గా ఎదిగారు.

రాజకీయాల మీద ఆసక్తితో తన సొంత మండలమైన బోగోలులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయంతో పాటు కప్పరాళ్లతిప్ప పోలీస్ స్టేషన్‌‌కు ఆధునిక హంగులు అద్దారు. బిట్రగుంట జిల్లా పరిషత్ హైస్కూలును ఏసీ స్కూలుగా మార్చారు.

పాఠశాలకు వచ్చే నెలవారీ కరెంట్ బిల్లును సైతం తానే చెల్లిస్తున్నారు. ముంగమూరు జడ్పీ హైస్కూలులో అదనపు వసతులు కల్పిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో గత 15 రోజులుగా సుధాకర్ తన సేవా కార్యక్రమాల్లో దూకుడు పెంచారు.

ఆలయాల నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధులు విరాళమిస్తున్నారు. బోర్లు, రోడ్లు వేయిస్తున్నారు. తొలుత జనసేనలో చేరుతానని ప్రకటించినప్పటికీ.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

తాజాగా సోమవారం జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు. వచ్చి రాగానే కావలిలోని ఓ పెద్ద భవంతిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో కావలి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీలో దిగుతున్నట్లు ప్రకటించారు.

జనసేన టిక్కెట్ దక్కకపోయినప్పటికీ ఎన్నికల బరిలో నిలిచి తీరాలని సుధాకర్ గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు కావలి నుంచి పోటీ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రధాన పార్టీ అభ్యర్థుల కన్నా స్వతంత్ర అభ్యర్థుల పేర్లే జనంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

విష్ణువర్థన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు వైసీపీపై తిరుగుబాటు చేయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించింది. వీరిద్దరూ ఒకేసారి రంగంలోకి దిగితే దాని ప్రభావం ప్రధాన పార్టీలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వీరికి తోడుగా ఇప్పుడు పసుపులేటి సుధాకర్ తాను కూడా బరిలో ఉన్నానడటంతో పోటీ ఆసక్తిగా మారింది. ఆర్ధికంగా బలంగా ఉన్న పసుపులేటి సుధాకర్ జనసేన నుంచి పోటీ చేస్తే మిగిలిన అభ్యర్థుల పరిస్ధితి క్లిష్టంగా మారుతుందని కావలిలో చర్చ నడుస్తోంది.

హైదరాబాద్‌లో సెటిలై, వ్యాపారాలు చేసుకుంటున్న పసుపులేటి సుధాకర్‌కు ఉన్నపళంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటీ..? కావలిలోనే ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది, ఆయన వెనుక ఎవరైనా బలమైన వ్యక్తులున్నారా..? లేక ఇండిపెండెంట్లకు చెక్ పెట్టడానికి ప్రధాన పార్టీల నేతలు సుధాకర్‌ను తెర మీదకు తీసుకొచ్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.