50మంది ప్రయాణికులతో శ్రీకాకుళం నుండి విజయవాడకు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. బస్సు సరిగ్గా ఓ నీటికాలువ అంచువరకు వెళ్లి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఏలూరు: 50మంది ప్రయాణికులతో నిండుగా వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన దుర్ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్సు రోడ్డుపక్కన గల రెయిలింగ్ ను ఢీకొని బోల్తాపడింది. సరిగ్గా ఓ నీటికాలువ పక్కనే బస్సు బోల్తా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ రెయిలింగ్ ను ఢీకొన్న తర్వాత బస్సు నీటికాలువలో దూసుకెళ్ళివుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా వుండేది.

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం నుండి విజయవాడకు దాదాపు 50మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అయితే ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను సమీపంలో ఈ బస్సు ప్రమాదానికి గురయ్యింది. హైవేపై వేగంగా వెళుతున్న బస్సు రోడ్డుపక్కన రక్షణకోసం ఏర్పాటుచేసిన రెయిలింగ్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. 

Video

ట్రావెల్స్ బస్సు సరిగ్గా ఓ నీటికాలువ అంచువరకు వెళ్లి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. మిగతావారు చిన్నచిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ బస్ యాక్సిడెంట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గతవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇలాగే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడటంతో పొట్టకూటికోసం ఏపీకి వలసవస్తున్న ఒడిశాకు చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఒడిశాకు చెందిన కొందరు స్వరాష్ట్రంలో ఉపాది కరువై పొట్టచేతపట్టుకుని ఆంధ్రప్రదేశ్ కు రావడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే చిన్నపల్లి నుండి సంగీత ట్రావెల్స్ బస్సులో కూలీలంతా విజయవాడకు బయలుదేరారు. అయితే కూలీలు ప్రయాణిస్తున్న ట్రావెల్స్ చింతూరు మండలం ఏడురాళ్ళపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. రోడ్డుపైనే పల్టీలు కొడుతూ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా వున్నారు. ధనేశ్వర్‌ దళపతి(24), జీతు హరిజన్‌(5), సునేనా హరిజన్‌(2) ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా మరో ఇద్దరు హాస్పిటల్లో మృతిచెందారు.