అనంతపురం: అనంతపురం జిల్లాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. అనంతపురం జిల్లాలోని తపోవనం సర్కిల్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

బెంగళూరు నుంచి హైదరాబాదు వస్తుండా లైమో ట్రావెల్ బస్సు మారూరు టోల్ గేట్ వద్ద బోల్తా పడింది. ప్రమాదానికి ముందు డ్రైవర్, క్లీనర్ గొడవ పడ్డారు. ఈ గొడవ కారణంగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడినట్లు భావిస్తున్నారు. 

టోల్ గేట్ సిబ్బందితో గొడవ పడినట్లు బస్సు డ్రైవర్ ప్రసాద్ చెబుతున్నాడు.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో మంటలు ఎగిసిపడినట్లు తెలుస్తోంది.

బస్సు ప్రమాదంపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు ఫాస్ట్ టాగ్ విషయంలో తలెత్తిన సమస్య వల్ల టోల్ గేట్ సిబ్బందితో డ్రైవర్ గొడవ పడినట్లు భావిస్తున్నారు.