చిత్తూరు ఎంపీ సినీనటుడు శివప్రసాద్ వివాదాల్లో ఇరుకున్నారు.. తమ మనోభావాలు దెబ్బతీసేలా ఎంపీ శివప్రసాద్ వ్యవహరించారని ఆరోపిస్తూ ట్రాన్స్ జెండర్స్ అసోషియేషన్ ఎంపీ శివప్రసాద్ పై ఫిర్యాదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని...పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని పలురాజకీయ పార్టీలు వివిధ రూపాలలో నిరసన గళం విప్పుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అయితే టీడీపీ ఎంపీ అయిన శివప్రసాద్ మాత్రం పార్లమెంట్ ప్రాంగణంలో వివిధ వేషధారణలతో నిరసన తెలుపుతున్నారు. స్వతహాగా నటుడు అయిన ఆయన తన వేషధారణలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏ వేషధారణతో దర్శనమిస్తారా అంటూ టీడీపీ ఎంపీలు సైతం ఎదురుచూస్తున్నారంటే ఎంతలా ఆకట్టకుంటున్నారో ఇట్టే చెప్పొచ్చు.

అయితే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ శివప్రసాద్ మహిళ వేషధారణ వేశారు. మోడీ బావా అంటూ అందర్నీ నవ్వించారు కూడా. అయితే ట్రాన్స్ జెండర్స్ మాత్రం ఆ వేషధారణనున సీరియస్ గా పరిగణించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారని ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా సింహాద్రి విజయవాడ గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించిన ఆందోళనలో భాగంగా మహిళ వేషధారణలో ఉన్న శివప్రసాద్‌.. ట్రాన్స్ జెండర్ అని చెప్పడం దారుణమన్నారు. తాము మహిళలతో సమానమని అన్న తమన్న సింహాద్రి శరీర భాగాలు మార్చుకుని మహిళలతో సమానంగా జీవిస్తున్న తమను ఎంపీ అవమానించారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే ఎంపీ శివప్రసాద్ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.