Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తప్పిన రైలు ప్రమాదం.. గేట్‌మెన్ నిర్లక్ష్యం.. లోకో పైలట్ సకాలంలో స్పందించడంతో..

ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై చర్చ సాగుతున్న వేళ.. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో రైలు  ప్రమాదం తప్పింది.

train tragedy was averted in kadiri of Andhra Pradesh ksm
Author
First Published Jun 3, 2023, 2:58 PM IST

అనంతపురం: ఒడిశాలోని బాలసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా  ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం రాత్రి రైలు  ప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగి ఉంటే.. రైల్వే సిబ్బంది నిరక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చి ఉండేదని చెబుతున్నారు. వివరాలు.. కదిరి రైల్వే స్టేషన్  సమీపంలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది.. నాగర్ కోయిల్ జంక్షన్ -ముంబయి సీఎస్‌ఎంటీ రైలు వచ్చే సమయంలో గేట్‍‌మెన్ గేటు వేయలేదు.

దీంతో వాహనాలు రైల్వే గేటు నుంచి అటు ఇటు తిరిగాయి. ఈలోపు రైలు రాకను గమనించి కొందరు స్థానికులు అప్రమత్తమై.. వాహనాలను నిలిపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కొందరు ట్రాక్ దాటసాగారు. అయితే ఇది గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. రైల్వే గేటుకు కొద్ది దూరంలో రైలు నిలిపివేశారు. అనంతరం లోకో పైలట్ అక్కడి గేట్ మ్యాన్‌ రూమ్‌కు వెళ్లాడు. అక్కడ గేట్ మ్యాన్ కానీ, ఇతర రైల్వే సిబ్బంది కానీ కనిపించలేదు. అక్కడ ఎవరూ లేకపోవడంతో వాకీటాకీలో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

రైల్వే గేటుకు కొద్ది దూరంలో లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గేట్‌మెన్ చేసిన నిర్లక్ష్యంపై వాహనాదారులు, స్థానికులు మండిపడుతున్నారు. లోకో పైలట్ సకాలంలో స్పందించి రైలు ఆపకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios