VIZIANAGARAM- RAYAGADA LINE: విజ‌యన‌గ‌రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.  ఈ క్రమంలో కోమరాడ మండలంలోని గుమడ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై భారీ వృక్షం కూలింది. దీంతో ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌గా.. పార్వతీపురం నుంచి రాయగడ రూట్‌లో వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా న‌డుపుతున్నారు. 

VIZIANAGARAM- RAYAGADA LINE: విజ‌యన‌గ‌రంలో ఈదురుగాలులు బీభ‌త్సం సృష్టించాయి. గురువారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఈదురు గాలులతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు కుండ‌పోత వర్షం కురిసింది. ఈ క్ర‌మంలో ఈదురుగాలుల‌తో పాటు.. ఉరుములు, పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజలు ఈదురుగాలులతో బెంబేలెత్తి పోయారు.

ఈదురుగాలులతో భారీ వృక్షాలు సైతం నేలమట్టమయ్యాయి. ప్రధాన రహదారిపై ఉన్న భారీవృక్షాలు నేలకొరగడంతో కొంతమేరకు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కోమరాడ మండలం గుమడ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై భారీ వృక్షం కూలింది. పార్వతీపురం నుంచి రాయగడ రూట్‌లో వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు రద్దు అయింది. 4 ప్యాసింజర్ రైళ్లు, 2 స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్లు, రెండు రైళ్ల‌ను దారి మ‌ళ్లించిన‌ట్టు.. అలాగే..మ‌రో రైళ్ల‌ను రీ షెడ్యూల్ చేసిన‌ట్టు రైల్వేశాఖ వెల్లడించింది. ట్రాక్‌పై పడిన చెట్టును తొలగించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. 


రైళ్లు రద్దు రైళ్ల వివరాలు: 

1. రైలు నం.18528 విశాఖపట్నం-రాయగడ ఎక్స్ ప్రెస్.
2. రైలు నం. 18527 రాయగడ-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్.
3. రైలు నం. 08528 విశాఖపట్నం-రాయ్‌పూర్ ఎక్స్ ప్రెస్. 
4. రైలు నం. 08527 రాయ్‌పూర్-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్. 
5. రైలు నెం.08546 విశాఖపట్నం-కోరాపుట్ ప్రత్యేక రైలు 
6. రైలు నం. 08545 కోరాపుట్-విశాఖపట్నం ప్రత్యేక రైలు

దారి మళ్లించిన రైళ్ల వివరాలు:

1. రైలు నం. 22973 గాంధీధామ్-పూరీ ఎక్స్‌ప్రెస్ ను గాంధీధామ్ నుండి బయలుదేరి టిట్లాగఢ్-సంబల్‌పూర్-అంగుల్-ఖుర్దా రోడ్డు మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
2. రైలు నెం. 18448 జగదల్‌పూర్-భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ 05.05.2022న జగదల్‌పూర్‌లో బయలుదేరుతుంది, కోరాపుట్-అరకు-కొత్తవలస-విజయనగరం మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.

రైలు రీషెడ్యూల్:

 రైలు నం. 18518 విశాఖపట్నం-కోర్బా ఎక్స్‌ప్రెస్.. విశాఖపట్నం నుండి 05.05.2022న బయలుదేరాల్సిన రైలు 2గంటలు ఆలస్యంగా బయలుదేరుతోంద‌ని రైల్వే అధాకారులు తెలిపారు. ప్ర‌యాణికులకు క‌ల్గిన అసౌకర్యానికి ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు రైల్వే అధికారులు.