సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటో ధరను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రేపటినుండి రైతు బజార్లలో సరసమైన ధరలకే టమాటాలను విక్రయించాలని నిర్ణయించారు.
అమరావతి: వేసవి కాలంలో టమాటా పంట (tomato crap) సరిగ్గా పండలేదు... పండిన కాస్తో కూస్తో పంట ఇటీవల వచ్చిన ఆసనీ తుఫాను కారణంగా దెబ్బతింది. అంతేకాదు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు టమాటా పంట దెబ్బతింది. ఇలా కారణమేదైతేనేం టమాటా పంట దెబ్బతినడంతో మార్కెట్లో టమాటాకు గిరాకీ పెరిగింది. గతకొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న టమాటా ధర (tomato price) ఏపీలో ప్రస్తుతం కిలో వంద రూపాయిలుగా వుంది. దీంతో అన్ని కూరల్లోనూ టమాటాను వాడే సామాన్యులు ఇప్పుడు వాటిని కొనాలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఎందుకొచ్చిన తంటా అని టమాటా వంక చూడటమే మానేసారు.
రైతు బజార్లలో కూడా కిలో టమాటా 70 రూపాయలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్ లో 100 రూపాయలు దాటిపోయింది. ఇలా టమాటా ధర చుక్కలనంటడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే నిర్షయం తీసుకుంది జగన్ సర్కార్. ఈ నెల 20 నుండి రైతు బజార్లలో సరసమైన ధరలకు టమాటా విక్రయించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాని గోవర్థన రెడ్డి ప్రకటించారు.
''టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో రైతు బజార్లలో ప్రభుత్వమే టమాటాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నాం'' అని మంత్రి కాకాని తెలిపారు.
''బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను కొనుగోలు చేయనుంది. ఇలా కొన్న టమాటాలను రాష్ట్రంలోని అన్ని రైతు బజార్ల ద్వారా సరసమైన ధరలకే విక్రయించేందుకు చర్యలను తీసుకుంటున్నాం. ఇందుకోసం చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓ కు కూడా ఆదేశాలు జారీచేయడం జరిగింది'' అని మంత్రి తెలిపారు.
''ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 20 నుండి రైతు బజార్లలో సరసమైన ధరలకే విక్రయిస్తున్న టమాటాలను కొనుగోలు చేసుకోవాలి'' అని మంత్రి కాకాని గోవర్ధన్ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో టమోటా పంట అధికంగా పడుతుంది. ముఖ్యంగా మదనపల్లెలో టమాట అధికంగా పండిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఓకే... లేకపోతే నష్టం వస్తుంది. అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి ధర ఉన్న సమయంలో తుఫానులు, వర్షాలు, వరదలు రావడంతో పంట దెబ్బతింటోంది. ఇలాంటి ఇబ్బందులకోర్చి పంట దిగుబడి బాగా వుంటే ఆ పంట చేతికి అంది వచ్చేసరికి ధర లేకపోవడం జరుగుతుంది. ఇలా టమాటా రైతులకు ఎప్పుడూ నష్టాలే ఎదురవుతున్నాయి.
ఈ ఏడాది కూడా రైతులు అనేక కష్టనష్టాలకు ఓర్చి టమాటా పంట వేశారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక, అకాల వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దీంతో మార్కెట్ లో టమాటా కు రెక్కలు వచ్చాయి. ఇలా టమాటా ధర పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రాంతాల నుంచి టమాటాలను దిగుమతి చేసి పెరిగిన ధరలను నియంత్రించేందుకు సిద్దమయ్యింది. .
