కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో వ్యాపారుల అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. పత్తికొండ మార్కెట్లో తాము చెప్పిందే రేటు అన్న రీతిలో వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఎంతో కష్టపడి పండించి మార్కెట్ కు తీసుకువచ్చిన రైతులకు కనీసం గిట్టుబాట ధరకు కూడా కొనుగోలు చేయకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. 

తమ కమిషన్ల కోసం రైతుల కడుపుకొడుతున్నారు. 30 కిలోల టమాటాను కేవలం రూ.30గా నిర్ధారించారు. 30 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్థులు. వ్యాపారస్తుల కుమ్మక్కు అయిన నేపథ్యంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. 

తమ కష్టానికి కూడా విలువ కట్టకుండా వ్యాపారులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారుల దోపిడీని తట్టుకోలేని రైతులు సుమారు 50 టన్నుల టమాటాను అక్కడే వదిలేసి వెల్లిపోయారు. 

ఆరుకాలం శ్రమించి పండించిన టమాటా పంటను కిలో కనీసం పది రూపాయలుగా కూడా నిర్థారించకపోవడంతో కడుపుమండిన రైతులు అక్కడే వదిలేశారు. కన్నబిడ్డలా సాకిన పంటను నడిరోడ్డుపై పారేస్తున్నారు. కొంతమంది రైతులు తమ సొంతఊర్లకు వెళ్లేందుకు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. 

బిల్లేకల్ మార్కెట్ లో 30 కిలోల బుట్ట రూ.350 రూపాయలకు కొనుగోలు చేస్తుంటే పత్తికొండలో మాత్రం కేవలం రూ.30 కే కొనుగోలు చేస్తామని ధర కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే పత్తికొండ మార్కెట్ లోని వ్యాపారులంతా కుమ్మక్కై తమను వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర మార్కెట్లో భారీగా రేట్లు ఉన్నా తమ దగ్గర తక్కువ ధరకే కేటాయిస్తూ తమ పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

వాస్తవానికి కర్నూలు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. కర్నూలు జిల్లాలోని50వేల ఎకరాలలోప్రధాన పంటగా టామాటా ఉంది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లోకి రైతులు టమాటాను తీసుకువచ్చి అమ్మకాలు చేస్తుంటారు. కర్నూలు నుంచి టమాటా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుంది. 

టమాటా విపరీతంగా పండటంతో పత్తికొండ మార్కెట్ కు టమాటాను తరలిస్తున్నారు రైతులు. సుమారు 200 టన్నుల టమాటా రోజూ మార్కెట్ కి వచ్చి చేరుతుంది. ప్రభుత్వ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోలు చేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోలేదు. దళారులు కమీషన్ వసూలు చేయకూడదన్న నిబంధన ఉండటంతో వ్యాపారులు ప్రైవేట్ స్థలంలో అమ్మకాలు చేపడుతున్నారు. 

ప్రైవేట్ స్థలంలో వ్యాపారు ఆగడాలకు అంతేలేకుండా పోతుంది. తాము నిర్ధారించిన ధరే ఫైనల్ అంటూ కిలో టమాటాను రూపాయికే కొనుగోలు చేస్తూ వారితో ఆటలు ఆడుకుంటున్నారు. 
దాంతో ఆగ్రహం చెందిన రైతులు ఆందోళనబాట పట్టారు. దళారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రైతుల ఆందోళన బాటపట్టడంతో వ్యాపారులు ఆగ్రహం చెందారు. కక్షతో తక్కువ ధరకే టమాటా ధరను నిర్ణయిస్తున్నారు. లేకపోతే లేదంటూ వేధిస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 

రైతుల పక్షాన పోరాడాల్సిన ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారు. వ్యాపారలు ప్రలోభాలకు లొంగి కొనుగోలుపై ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. అటు కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు మాత్రం దళారులకే కొమ్ముకాస్తూ రైతుకు వెన్నుపోటుపొడుస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా టమాటా వ్యాపారుల పరిస్థితిపై దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.