బిడ్డ ఆకలి తీర్చాలని ఆమె అనుకుంది. తమ ముద్దుల పాపాయి.. హాల్ ఆడుకుంటుంటే... కిచెన్ లోకి వెళ్లి అన్నం తీసుకొని రావాలని అనుకుంది. ఆమె అలా కిచెన్ లోకి వెళ్లగానే... ఇలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ఆమె అన్నం కలుపుకు వచ్చేలోపు... తమ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. టీవీ మీద పడి 11 నెలల చిన్నారి మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండల పరిధి అర్చనాపురం గ్రామానికి చెందిన జె.లక్ష్మీనారాయణ, వరలక్ష్మి దంపతులు కొన్నాళ్ల కిందట పలాసకు వలస వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. బాబు  యశ్వంత్ ఏడో తరగతి చదువుతుండగా... పాపకు 11 నెలలు. వీళ్లు కేవలం  నెల రోజుల కిందటే న్యూకాలనీకి మారారు. 

బుధవారం వరలక్ష్మి తన 11 నెలల పాప మొహరాణికి అన్నం తినిపిస్తోంది. మధ్యలో పాప పాకురుకుంటూ మరోగదిలోకి వెళ్లింది. ఇంతలో పెద్దశబ్దం వినిపించడంతో భయకంపితురాలైన వరలక్ష్మి అక్కడకు వెళ్లగా పాపపై టీవీ పడి ఉండడం కనిపించింది. టీవీని పక్కకు తీసి పాపను చూడగా తలపై తీవ్రగాయమై రక్తం కారుతూ కనిపించింది.
 
వెంటనే ఇరుపుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారంతా వచ్చి పాపను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. టీవీ వైర్లు కిందకు వేలాడుతూ కనిపించాయి. ఆటవస్తువుగా భావించి చిన్నారి ఆ వైర్లను లాగడంతో టీవీ ఆమె తలపై పడింది. మరో నెల రోజుల్లో పాప పుట్టిన రోజును ఘనంగా నిర్వహిద్దామనుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన జరగడంతో తల్లిదండ్రులు గుండలవిసేలా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. 

అప్పటి వరకు బోసి నవ్వులతో తమ కళ్ల ముందే తిరిగిన చిన్నారి... ఒక్కసారిగా విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. వచ్చే నెలలో ఘనంగా పుట్టిన రోజు జరిపించాలని వారు భావించారు. తీరా ఇలా జరగడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.