చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల జప్తుకు సిఐడి సిద్దం ... నేడు కోర్టు ఏమంటుందో చూడాలి?
ఇప్పటికే చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేసి నైతికంగా దెబ్బకొట్టిన వైసిపి ఆర్థికంగాను దెబ్బతీసేందుకు సిద్దమయ్యింది.

అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఫైబర్ గ్రిడ్ పేరిట భారీ అవినీతి జరిగిందని వైసిపి ఆరోపిస్తోంది. దీంతో ఇప్పటికే ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయకుడు నారా లోకేష్ తో పాటు మరికొందరిపై సిఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలో ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినవారి ఆస్తుల అటాచ్ మెంట్ కు సిఐడి సిద్దమయ్యింది. ఇందుకు అనుమతి కోరుతూ విజయవాడ ఏసిబి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలుచేయగా దీనిపై ఇవాళ విచారణ జరగనుంది.
ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ సిఐడికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం అనుమతి కూడా కోరింది సిఐడి. ఇందుకోసం సిఐడి దాఖలుచేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది ఏసిబి కోర్టు.
ఫైబర్ గ్రిడ్ పేరిట ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహితులకు లాభం చేసాడని సిఐడి ఆరోపిస్తోంది. ఇలా అక్రమాలకు పాల్పడిన టెరాసాప్ట్ తో పాటు వేమూరి హరిప్రసాద్ కు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సిఐడి అధికారులు భావిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరుతో పాటు హైదరాబాద్ లోని దాదాపు రూ.114 కోట్ల ఆస్తుల జప్తుకు సిఐడి సిద్దమయ్యింది.
Read More కేసీఆర్, చంద్రబాబు లకు ఆ దమ్ము లేదు... నేనయితే డైరెక్ట్ ప్రధానితోనే..: కేఏ పాల్
అయితే అసెంబ్లీ ఎన్నికలకు సయయం దగ్గరపడుతుండటంతో చంద్రబాబును నైతికంగానే కాదు ఆర్థికంగానూ దెబ్బతీయాలని అధికార వైసిపి భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే చంద్రబాబుపై అనేక కేసులు పెట్టడమే కాదు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైల్లో కూడా పెట్టింది. ఇలా చంద్రబాబును ఆర్థిక నేరగాడిని ప్రజలముందు నిలబెట్టేందుకు వైసిపి ప్రయత్నిస్తోంది.
అలాగే చంద్రబాబు ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అతడి సన్నిహితులపై పడింది వైసిపి. ఎన్నికల్లో టిడిపి ఆర్థిక అవసరాలు తీర్చేవారిని టార్గెట్ చేసారు. ఇందులో భాగంగానే సిఐడి ద్వారా ఆస్తుల జప్తుకు సిద్దమయ్యింది. వైసిపి కక్షపూరితంగానే చంద్రబాబుపై కేసులు పెట్టడం, ఆస్తులను జప్తు చేయడం చేస్తోందని టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.