తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన హఠాత్తుగా ఈ ప్రకటన చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

సీఎం వైయస్ జగన్ మంత్రి వర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్న తరుణంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి ప్రకటన చేయడం వెనుక ఉద్దేశం ఏమైనా ఉందా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. 

మంత్రి పదవిని ఆశిస్తున్న ఆశావాహుల జాబితా పెద్ద లిస్ట్ ఉండటంతో భవిష్యత్ లో పోటీ చేయను అని ప్రకటిస్తే జగన్ మంత్రి వర్గంలో చోటు కల్పించే ఛాన్స్ ఉండొచ్చని భూమన ప్లాన్ వేశారా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రి వర్గంలో స్థానం కోసమే భూమన జగన్ కు ఈ సంకేతం పంపారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. 

ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి సుగుణమ్మపై స్వల్ప ఓట్ల తేడాతో గెలిచారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు వేలకు వేలు మెజారిటీతో గెలిస్తే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం కేవలం 780 ఓట్ల మెజారిటీతో గెలిచారు.   

భూమన అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందడంపై పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. భూమనపై ప్రజల్లోనే కాకుండా పార్టీ నేతల్లో కూడా అసంతృప్తి ఉందని సమాచారం. ఈ ఎన్నికల్లో భూమనకు టికెట్ ఇవ్వరంటూ కూడా ప్రచారం చేశారు. 

అయితే వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో జగన్ టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని ఇప్పటికీ చెప్తుంటారు. ప్రజల్లోనూ, వైసీపీ కార్యకర్తల్లోనూ భూమనపై ఉన్న వ్యతిరేకతే వచ్చిన మెజారిటీకి నిదర్శనమని వైసీపీలో చర్చ జరుగుతోంది. 

భవిష్యత్ లో గెలవలేమనే ఆందోళనతో భూమన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారా లేక వారసులను రాజకీయ రంగం ప్రవేశం చేస్తారా లేక జగన్ కేబినెట్ లో బెర్త్ కోసం ఈ సంకేతం పంపారా అన్నదానిపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.