హైవేలపై వాహనాలు ఆపి దోపిడీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను తిరుపతిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఫిబ్రవరి 27వ తేదీన ఓ లారీ డ్రైవర్ ను, అతడి సహాయకుడిని ఆపేసి వారి నుంచి నగదు, సెల్ ఫోన్లు దొంగతనం చేసి తీసుకెళ్లిపోయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
నేషనల్ హైవేలే వారి టార్గెట్. హైవేలపై కాపు కాసి వాహనాల్లో ఒంటరిగా ఉన్న వారిని గమనించి ఆపేందుకు ప్రయత్నిస్తారు. సహాయం కోసం ఆపుతున్నారు అని భావించి వాహనాన్ని నిలిపివేశారనుకోండి ఇక అంతే సంగతులు. వారి వద్ద ఉన్న ఆయుధాలతో బెదిరిస్తారు. డబ్బు, నగలు ఇంకా ఏవైనా విలువైన వాహనాలు ఉంటే లాక్కొని అక్కడి నుంచి జంప్ అయిపోతారు. కానీ ఇలాంటి వారి ఆగడాలు ఎక్కువ రోజులు సాగవు కదా..ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముగ్గురు కరుడుగట్టిన హైవే (highway) దొంగల ముఠా (robbers gang)ను తిరుచానూరు (Tiruchanoor) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరు జాతీయ రహదారులపై వెళ్లే ట్రక్కులను టార్గెట్ చేసేవారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో నిందితులు పి. గోపి (21), డి. షాషావలి (21), పి వాసు (20) ఉన్నారు. వీరంతా స్థానిక జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఫిబ్రవరి 27వ తేదీన ఓ లారీ డ్రైవర్ (lorry driver) తిరుచానూరు (Tiruchanoor) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. వేదంతపురం సమీపంలోని హైవేపై ముగ్గురు వ్యక్తుల ముఠా అతడి వాహనాన్ని ఆపింది. అతనిపై, అతడి సహాయకుడిపై కత్తులు చూపించాడు. వారిద్దరిని తాళ్ల సాయంతో కట్టేసి వారి వద్ద నుంచి నగదును, సెల్ ఫోన్లను లాక్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టీ మురళీకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఇదే పద్ధతిలో నేరాలు చేసే నేరస్తులను ఈ పోలీసు బృందం విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు బృందం ఘటనకు పాల్పడిన ముఠా సభ్యులను తిరుపతిలోని మామిడి తోట సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా.. మొబైల్ ఫోన్ స్నాచింగ్ ముఠాను హైదరాబాద్ లో జనవరి 29వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా రాత్రి పూట రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారిని టార్గెట్ చేస్తూ వారి నుంచి మైబైల్స్ లాక్కుంటారు. నిందితులను మహ్మద్ ఖాజా పాషా అలియాస్ ఖాజా (19), పెయింటర్ మహ్మద్ సబీల్ (19), డిగ్రీ విద్యార్థి మహ్మద్ సబీల్ (19), పెయింటర్ షేక్ సోహైల్ (19), ఎం.పవన్ కుమార్ (20)లుగా గుర్తించారు.
నిందుతుల అంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. వీరంతా స్నేహితులు. అయితే వీరికి సరైన ఆదాయ వనరులు లేకపోవడంతో రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారిని టార్గెట్ చేసుకుంటారు. అదను చూసి వారి నుంచి మొబైల్స్ లాక్కుంటారు. ఆ మొబైల్స్ ను అమ్మేసి డబ్బును సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే నిందితుల్లో ఒకరైన పాషా ఓ బైక్ కొనుగోలు చేశారు. దాని ద్వారా రాయదుర్గంలో మొబైల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. అలాగే ముఠాలోని సభ్యులు జనవరి 24నవ తేదీన రాత్రి సింగాడి కుంట ఆటో స్టాండ్‌లో కలుసుకుని మద్యం సేవించారు. అనంతరం గోల్కొండలోని టోలీచౌకీకి వెళ్లి పాదచారుల మొబైల్ ఫోన్ లాక్కెళ్లారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లో మరో వ్యక్తి మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని, చుట్టు పక్కల పరిసరాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అనంతరం నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.
