కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల బంగారు కిరీటాలు మాయమైన సంఘటన తిరుపతి పట్టణంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుపతి పట్టణం నడిబొడ్డున వున్న  గోవిందరాజస్వామి ఆలయంలో వజ్రాలు పొదిగిన కిరీటాలు మాయమవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కిరీటాల మాయం వెనుక అధికారుల హస్తమేమీ లేదని...ఇది దోపిడి దొంగల పనేనని పోలీసులు తేల్చారు. 

ఈ నెల 2వ తేదీన కిరీటాలు మాయమైనట్లు ఫిర్యదు అందగానే ఆరు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా అర్బన్ ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా పోలీసులు మరియు టిటిడి విజిలెన్సు అండ్ సెక్యూరిటీ వారి ప్రతేక దర్యాప్తు బృందాలు కలిసి సమన్వయం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆలయం వద్ద వున్న అన్ని సిసి కెమెరాల ఫుటేజీల ఆధారంగా నేరానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తిని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. 
 
సదరు వ్యక్తిని సంబంధించిన ఫోటోను ఎస్పీ విడుదల చేశారు. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరికైనా కనిపించినా, ఆచూకీ తెలిసినా తిరుపతి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు 100---8099999977 ఫోన్ చేసి అనుమానితుడికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా అందించవచ్చని...సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అంతేకాకుండా సరైన సమాచారం అందించిన వారికి టిటిడి(తిరరుమల తిరుపతి దేవస్థానం), పోలీస్ శాఖ తరపున బహుమానం అందించనున్నట్లు అన్బురాజన్ ప్రకటించారు.