తిరుమల కాలినడక మార్గాల్లో వన్యప్రాణుల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనకు గురిచేస్తుంది.
తిరుమల కాలినడక మార్గాల్లో వన్యప్రాణుల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనకు గురిచేస్తుంది. అలిపిరి మెట్ల మార్గంలో ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిసరాల్లో మరిన్న చిరుతలు సంచరిస్తున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగానే.. శ్రీవారి మెట్టు మార్గంలో ఈరోజు ఉదయం ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. ఉదయం 2000వ మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. ఇక, తిరుమల కాలినడక మార్గాల పరిసరాల్లో వన్యప్రాణుల సంచారంతో శ్రీవారి భక్తులు మరింత భయాందోళన చెందుతున్నారు.
ఇక, తిరుమల కాలినడక మర్గాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టుగా ట్రాప్ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఇటీవల చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన తర్వాత.. కాలినడక మార్గాల్లో భద్రతపై టీటీడీ మరింత కసరత్తు ప్రారంభించింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గాల్లో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా నడకమార్గాల్లో చిన్నారుల చేతులకు ట్యాగ్‌లు కడుతున్నారు.
ఇదిలాఉంటే, తిరుమలలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంతో పాటు సమీపంలోని మూడు ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. సోమవారం తెల్లవారుజామున ఏడో మైలు వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కిందని అధికారులు తెలిపారు.
ఇక, కాలినడక మార్గాల్లో చిరుతల నుంచి భక్తులకు భద్రతపై టీటీడీ, అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో మధ్యాహ్నం 3గంటలకు ఈ సమీక్ష జరగనుంది.
