Asianet News TeluguAsianet News Telugu

తీవ్రరూపం దాల్చిన తిత్లీ తుఫాన్: వణుకుతున్న ఉత్తరాంధ్ర

ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలను తిత్లీ తుఫాన్ వణికిస్తోంది. ఉదయం తుఫాన్ శ్రీకాకుళం జిల్లా పలాస మరియు ఒడిస్సాలోని గంజాం ప్రాంతాల మధ్య తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. 

tiltli cyclone effect 8 members dead
Author
Visakhapatnam, First Published Oct 11, 2018, 9:20 PM IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాలను తిత్లీ తుఫాన్ వణికిస్తోంది. ఉదయం తుఫాన్ శ్రీకాకుళం జిల్లా పలాస మరియు ఒడిస్సాలోని గంజాం ప్రాంతాల మధ్య తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు ఎనిమిదిమంది మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతిచెందారు.

తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయ్యింది. దాదాపు ఎనిమిది మండలాలు సర్వనాశనమయ్యాయి. కోటబొమ్మాలి, గారా, సోంపేట, వజ్రపు కొత్తూరు, కవిటి, మందస, ఇచ్చాపురం, సోంపేట, మందస మండలాల్లో తిత్లీ తుఫాన్ విరచుకుపడింది. గంటకు 140 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తుండటంతో ఇంటిపై కప్పులు ఎగిరిపడ్డాయి. 

భారీ వృక్షాలు రోడ్లపైకి పడటంతో పలు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. తుఫాన్ ధాటికి జిల్లా వ్యాప్తంగా 3వేల విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోవడంతో అంతా అంధకారమయమైంది.  
 
నందిగాం మండలంలోని జల్లుపల్లి చెరువుకు గండిపడింది. దీంతో జల్లుపల్లి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా మహేంద్ర తనయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మందస మండలంలోని మూలిపాడు, శ్రీనివాసపురం, ముకుందపురం, గోపాలపురం గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. అటు భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో వంశధార నిర్వాసితుల గ్రామాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా కొత్తూరులోని వంశధార నిర్వాసితుల ప్రాంతాల్లో ఈదరుగాలుల ప్రభావానికి ఇంటిపైకప్పు ఎగిరిపోయాయి. 

అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గురువారం, శుక్రవారం జరగాల్సిన ఇంటర్‌ హాఫ్‌ ఇయర్లీ పరీక్షలు వాయిదా వేసిననట్లు ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉదయలక్ష్మీ ప్రకటించారు.

తిత్లీ తుఫాన్ ధాటికి పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విశాఖ-పలాస ప్యాసింజర్‌, ఎర్నాకులం-హుతియ ఎక్స్‌ప్రెస్‌ లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. విశాఖ-న్యూపలాస రైళును మాత్రం విజయనగరం వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. అలాగే దువ్వాడ, విజయనగరం, ఖుర్దా స్టేషన్లలో పలు రైళ్లు నిలిపివేయగా కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.  
 
తిత్లీ తుపాన్ కారణంగా విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కి రావాల్సిన ఇండిగో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు.  

మరోవైపు తుఫాను ప్రభావం 12మండలాలపై తీవ్రంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. టెక్కలిలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ కుప్పకూలిపోయినట్లు తెలిపారు. శుక్రవారం లోగా టెక్కలి సబ్‌స్టేషన్‌‌ను పునరుద్ధరిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3వేల వరకూ విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు తెలిపారు. రెండు వేల మంది సిబ్బందితో విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పునరుద్ధరిస్తామని కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios