గుంటూరు: పచ్చని సంసారంలో టిక్ టాక్ చిచ్చు పెట్టింది. టిక్ టాక్ మోజులో పడి తన భార్య తనకు దూరమవుతుందని భావించిన భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించి హత్య చేశాడు. 

వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం పొట్టూరుకు చెందిన చిన నరసయ్య, సువార్త దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. సువార్తకు టిక్ టాక్ పై మక్కువ ఎక్కువ కావడంతో వాటితోనే ఎక్కువగా కాలక్షేపంచేస్తూ ఉండేది. 

వేరొకరితో‌ కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుండటంతో భర్త చిన నరసయ్యకు అనుమానం వచ్చింది. టిక్ టాక్ వీడియోలు మానెయ్యాలని పలుమార్లు హెచ్చరించాడు. టిక్ టాక్ మోజులో పడి తమను నిర్లక్ష్యం చేయోద్దంటూ కోరాడు. అయినప్పటికీ సువార్త తన పద్దతి మార్చుకోలేదు. 

టిక్ టాక్ మోజులో పడి తన భార్య వేరే వాళ్లతో పరిచయం పెట్టుకుందని అనుమానం పెంచుకున్నాడు. ఇక భార్యపై అనుమానం పెంచుకున్న చిన నరసయ్య ఆమెతో నిత్యం గొడవ పడుతున్నాడు.

నిత్యం భర్తతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేని సువార్త ఇంటి నుంచి వదిలి వెళ్లిపోయింది. కన్నకుమార్తెను సైతం పట్టించుకోకుండా హాస్టల్ లో చేరింది. హాస్టల్ లో ఉంటూ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉంటుంది.  

అయితే ఇటీవలే తాను మారానని ఎలాంటి గొడవలు ఉండవంటూ నమ్మించి ఈనెల 17న సువార్తను ఇంటికి తీసుకువచ్చాడు చిన నరసయ్య. అన్న వెంకయ్యతో కలిసి దారుణంగా హత్య చేశారు. అనంతరం అన్నదమ్ములిద్దరూ గ్రామ స్మశానంలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. 

స్మశాన వాటికలో మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో పలువురు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం సువార్తదని గుర్తించడంతో భర్తను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
చిన నరసయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పచ్చని సంసారంలో టిక్ టాక్ చిచ్చు పెట్టిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లి హత్యకు గురవ్వడం, హత్య చేసినందుకు తండ్రి జైలు పాలవ్వడంతో వారి కుమార్తె అనాథగా మిగిలిపోయింది. తల్లిచనిపోయిందన్న విషయం తెలుసుకున్న బాలిక బోరున విలపిస్తోంది.