తిరుపతి: కరోనా విజృంభణ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మూతపడ్డ తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 11వ తేదీన తెరుచుకున్న విషయం తెలిసిందే. అప్పటినుండి నేటికీ పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. అయితే నిన్న(గురువారం) మాత్రం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 
 
గురువారం రాత్రి 9గంటల సమయానికి స్వామివారిని  11,577 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారి సంఖ్య 3,369. అలాగా లాక్ డౌన్ తర్వాత మొదటిసారి కోటి రూపాయిలకు పైగా హుండీ ఆదాయం లభించింది. గురువారం ఒక్కరోజే 1.06 కోట్లుగా స్వామివారికి హుండీ ఆదాయం లభించింది.  

తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఇటీవలే టీటీడీ పెంచింది. సెప్టెంబర్ 2వ తేదీ నుండి మరో వెయ్యి టిక్కెట్లను పెంచింది. పెంచిన వెయ్యి టిక్కెట్లను ఆన్ లైన్ లోనే విక్రయించనున్నారు. దీంతో ప్రతి రోజూ 13 వేల మందికి శ్రీవారి దర్శనం దక్కనుంది.

read more   తిరుమల సమాచారం... శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే

ఈ ఏడాది ఆగష్టు 27వ తేదీ నుండి భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కల్పించారు. ఆఫ్ లైన్ లో ప్రతి రోజూ  3 వేల టిక్కెట్లను భక్తులకు అందిస్తున్నారు. తాజాగా టీటీడీ తీసుకొన్న నిర్ణయంతో ప్రతి రోజూ ఆన్ లైన్ లో 10వేల టిక్కెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. 

 కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుండి తిరుపతిలో భక్తులకు దర్శనాలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 8వ తేదీ నుండి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా కరోనా విజృంభణతో భక్తులకు శ్రీవారి దర్శనాలను నిలిపివేశారు.  అయితే ఇటీవల తిరుమలలో పరిస్థితులు మెరుగుపడటంతో మరింతమంది ఎక్కువ భక్తులకు స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పించాలని టిటిడి పాలకమండలి భావించి తాజా నిర్ణయం తీసుకుంది.