ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం పొంచివుందని... ప్రజలు జాగ్రత్తగా, అధికారులు అప్రమత్తంగా వుండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ప్రకాశం, కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు పిడుగుపాట్ల ప్రమాదం పొంచివుందని... ప్రజలు జాగ్రత్తగా, అధికారులు అప్రమత్తంగా వుండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. 

''ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, తర్లుపాడు, కోనకనమిట్ల, హనుమంతునిపాడు, బేస్తవారిపేట, వెలిగండ్ల, కంభం, అర్ధవీడు, గిద్దలూరుతో పాటు కర్నూలు జిల్లాలో నంద్యాల, గోస్పాడు, వెల్దుర్తి, క్రిష్ణగిరి, గూడూరు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి'' అని కన్నబాబు సూచించారు. 

ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చెట్టు కూలి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులతో కరెంట్ తీగలు తెగిపడటంతో మరికొన్ని గ్రామాలు అందకారంగా మారాయి. ఇలా తెలంగాణలో బీభత్సం స్రుష్టించిన వర్షం ఏపీలో బీభత్సానికి రెడీ అయ్యింది.