రాజమండ్రి సమీపంలో ఆనందంగా సాగుతున్న స్నేహితుడి పుట్టినరోజు వేేడుక రోడ్డు ప్రమాదంతో విషాదాంతమయ్యింది. కారు యాక్సిడెంట్ లో ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. 

రాజమండ్రి : అర్థరాత్రి వరకు స్నేహితుడి పుట్టినరోజు వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. ఇదే ఆనందంలో స్నేహితులంతా కలిసి కారులో ఇళ్లకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వారి సంతోషాన్ని ఆవిరిచేస్తూ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కేరింతల మధ్య సాగుతున్న వీరి ప్రయాణం ఒక్కసారిగా ఆర్ధనాదాలతో నిండిపోయింది. ఇలా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. 

వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరంకు చెందిన ఆరుగురు యువకులు మంగళవారం స్నేహితుడి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. అర్ధరాత్రి వరకు స్నేహితులంతా భర్త్ డే పార్టీలో సరదాగా గడిపారు. అనంతరం అందరూ కలిసి ఓ కారులో విశాఖపట్నం బయలుదేరారు. 

అయితే అర్థరాత్రి హైవేపై వాహనాలు తక్కువగా వుండటంతో యువకులు కారును అతివేగంగా నడిపినట్లున్నారు. రాజమండ్రి సమీపంలోని హుకుంపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డుపక్కకు దూసుకెళ్లిన కారు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు జయదేవ్ గణేష్, వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన యువకులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

తాము వద్దని చెప్పినా వినకుండా స్నేహితుడి పుట్టినరోజు వుందంటూ అర్థరాత్రి బయటకు వెళ్లి ఇలా ప్రమాదానికి గురయ్యారని యువకుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. కన్నకొడుకుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇక ఇటీవల కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో తండ్రీ కొడుకు దుర్మరణం చెందారు. జిల్లాలోని గండేపల్లి గ్రామ శివారులో కారు ప్రమాదానికి గురవడంతో అందులో ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. 

రాగంపేటకు చెందిన కంటే విశ్వనాథం భార్యాకొడుకుతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా గండేపల్లి గ్రామ శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో విశ్వనాథ్ తో పాటు అతడి కొడుకు రాజేష్ అక్కడికక్కడే మృతిచెందారు. విశ్వనాథ్ భార్య మాత్రం గాయాలతో ప్రాణాలతో బయటపడింది. 

మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రానైట్‌ లోడుతో రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ, మెటల్‌ లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో లారీల క్యాబిన్‌లో డ్రైవర్లు ఇరుక్కుపోయారు. 

జేసీబీ సహాయంతో డైవర్స్‌ని బయటకు తీశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఓ లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. మరొక డ్రైవర్ని గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి చికిత్స అందడంతో ప్రాణాలు దక్కాయి.