విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కలకలం రేపిన లాడ్జీలో బీటెక్ విద్యార్ధినిపై అత్యాచార యత్నం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్ బుక్ లో పరిచయమైన బీటెక్ విద్యార్థినిని ఉద్యోగం ఉందని నమ్మించి లాడ్జీలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేయబోయిన ముగ్గురు యువకులపై బాధితురాలి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మణికంఠ, ధీరజ్,భాషలను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.  

మైలవరంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న అమ్మాయికి ఇబ్రహీం పట్నంకు చెందిన మణికంఠ అనే యువకుడితో ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. మణికంఠ ఆ యువతికి ఉద్యోగం ఉందని తనను కలవాలంటూ మెసేజ్ చేసినట్లు తెలిసింది. కలిసేందుకు ఆ యువతి అంగీకారం తెలపడంతో మణికంఠ ఆ అమ్మాయిని ఈనెల 11న కేవీఆర్ గ్రాండ్ హోటల్ లో రూమ్ బుక్ చేసుకుని కారులో తీసుకెళ్లాడు. 

రూమ్ లో ఉన్న మణికంఠ, బీటెక్ విద్యార్థిని ఉండగా కొంతసేపటి తర్వాత అతని స్నేహితులు ధీరజ్,భాషలు రూమ్ వద్దకు చేరుకున్నారు. ముగ్గురు కలిసి ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆ దృశ్యాలను సెల్ ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే బీటెక్ స్టూడెంట్ వారి బారినుంచి తప్పించుకుని బయటపడింది.  

అయితే సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనపై ఎలాంటి అత్యాచారం జరగలేదని మణికంఠ అనే స్నేహితుడితో కలిసి లాడ్జికి వెళ్లానని అక్కడ అతని స్నేహితులు తనపై అత్యాచార యత్నం చెయ్యడానికి ప్రయత్నించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులపై అత్యాచారయత్నం అభియోగాలు కింద కేసు నమోదు చేశారు.