బైక్ పై మితిమీరిన వేగంతో వెళుతున్నముగ్గురు యువకులు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖపట్నం: బైక్ పై రయ్ రయ్ మంటూ వేగంగా వెళ్లడం సరదాగా బావిస్తుంటారు యువకులు. అయితే ఆ అతివేగమే యువకుల ప్రాణాలను హరిస్తోంది. ఇలా బైక్ పై మితిమీరిన వేగంతో వెళుతున్నముగ్గురు యువకులు ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
మాకవరపాలెం మండలం పి.పి.అగ్రహారం వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు అర్ధరాత్రి సమయంలో ఒకే బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. మితిమీరిన వేగంతో వెళుతూ బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఓ చెట్టుకు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డ యువకుల వివరాలు తెలియాల్సి వుంది.
