సారాంశం
కాలుజారి బావిలో పడిపోయిన కాపాడబోయి తండ్రి, అతడిని కాపాడబోయి మరొకరు నీటమునిగి మృతిచెందిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
పల్నాడు : జీవాలు మేపడానికి వెళ్ళిన తండ్రి కొడుకుతో సహా ముగ్గురు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఎండవేడిమికి అల్లాడిపోతున్న జీవాలను నీటిలో దించేందుకు ఓ బావివద్దకు తీసుకెళ్లగా అందులో మునిగే ముగ్గురు కాపరులు మృతిచెందారు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన ఎనుముల నాగులు(45) గొర్రెల కాపరి. జీవాలను పెంచుకుంటూ వాటిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతడికి తొమ్మిదో తరగతి పూర్తిచేసిన నాగార్జున(15) సంతానం.కొడుకు వేసవి సెలవుల్లో ఇంటివద్దే వుండటంతో తనవెంట గొర్రెలు మేపడానికి తీసుకువెళుతున్నాడు నాగులు. రోజూ మాదిరిగానే నిన్న(గురువారం) కూడా తండ్రికొడుకులతో పాటు బంధువు ఎనుముల ఆంజనేయులు(60) గొర్రెల మందను తీసుకుని మేపడానికి పొలానికి వెళ్లారు.
గురువారం ఉదయం మేతకోసం తీసుకెళ్లిన గొర్లు మధ్యాహ్నం తీవ్ర ఎండలకు అల్లాడిపోయాయి. వారికి దగ్గర్లోని ఓ బావిలో నీరు నిండుగా వుండటంతో జీవాలను అందులోకి వదిలారు. బావి పక్కనే నిలుచుని గొర్రెలను చూస్తున్న బాలుడు నాగార్జున ఒక్కసారిగా కాలుజారి నీటిలో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో కాపాడేందుకు తండ్రి నాగులు కూడా నీటిలోకి దూకాడు. ఎంతకూ తండ్రికొడుకులు బయటకు రాకపోవడంతో వారిని కాపాడేందుకు ఆంజనేయులు కూడా బావిలోకి దూకాడు. కానీ అతడు కూడా తిరిగి పైకి రాలేదు.
Read More ఇదీ తల్లి ప్రేమంటే : గుంతలో పడ్డ చిన్నారులు.. పిల్లలను రక్షించి తాము ప్రాణాలొదిలి
ఇలా కొడుకు కాపాడబోయి తండ్రి... వారిద్దరికి కాపాడబోయి మరొకరు నీటమునిగారు. ఇది గమనించిన మరో గొర్రెల కాపరి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా గ్రామస్తులకు తెలిపాడు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు వచ్చేసరికే ఈ ముగ్గురూ ఊపిరాడక మృతిచెందారు. తాళ్ల సాయంతో బావిలోకి దిగిన గ్రామస్తులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీసారు.
తండ్రికొడుకులు ఒకేసారి మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆంజనేయులు కూడా నాగులుకు బాబాయి వరస అవుతాడు.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు.