విజయనగరం జిల్లాలో ఓ కొత్తఇంటి నిర్మాణ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ఇనుపచువ్వ కరెంట్ తీగలకు తగిలి ఇద్దరు యువకులు, ఓ మహిళ మృతి చెందారు. 

విజయనగరం : ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. గురువారం నాడు విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సోమన్నపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. దీనిమీద విజయనగరం సిఐ ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాండ్రంకి రామినాయుడు అనే వ్యక్తి సోమన్నపేటలో కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయన చిన్నకొడుకు కేసరి (22) ఇసుకను పై అంతస్తుకు తీసుకువెడుతుంటే ఇనుప చువ్వలు అడ్డంగా ఉన్నాయి. వాటిని అడ్డు తొలగించడం కోసం కాలితో పక్కకి నెట్టాడు. అవి ఇంటి దగ్గర్లో ఉన్న కరెంటు తీగలకు తగిలాయి. వెంటనే కరెంట్ షాక్ రావడంతో కేసరి కొట్టుకోసాగాడు.

Andhra Pradesh: మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఫోన్‌తో వీడియో రికార్డింగ్

అదే గ్రామానికి చెందిన కేసరి స్నేహితుడు గండ్రేటి చంద్రశేఖర్ (18) సామాగ్రి తరలించేందుకు సహాయం కోసం వచ్చాడు. కేసరికి కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా అరుస్తూ అతడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చంద్రశేఖర్ కు కూడా కరెంట్ షాక్ కొట్టింది. ఈ మొత్తం ఘటనను ఎదురుగా ఉన్న అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్న దూబరేయ్యమ్మ (57) చూసింది. కుర్రాళ్ళు ఇద్దరు షాక్ తో విలవిలలాడుతుండడంతో కాపాడడం కోసం ప్రయత్నించింది. దీంతో ఆమె కూడా కరెంట్ షాక్ కు గురైంది.

ఈ హడావుడి అంతా గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్ సరఫరాను ఆపడానికి ప్రయత్నించారు. ఆ ముగ్గురుని రక్షించాలని చూశారు. కానీ, అప్పటికే ఆ ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలుముకున్నాయి. ఈ విషాద ఘటనపై స్పందించిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

సోమన్నపేట గ్రామంలోని వీధుల్లో ఇళ్లకు చాలా సమీపంలో కరెంటు తీగలు ప్రమాదకరంగా మారాయి. వీధికి ఇరువైపులా ఉన్న ఇళ్లకు కేవలం నాలుగడుగుల దూరంలోనే కరెంటు వైర్లు వెళ్తున్నా ఎటువంటి రక్షక కవచాలు లేవు. దీంతోనే ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విద్యుత్తు లైన్లను 20 ఏళ్ల కిందట వేసినట్లుగా రాజాం విద్యుత్ శాఖ డిఈఈ ఫణి కుమార్ తెలిపారు.