అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బంపర్ మెజారిటీతో గెలుపొందిన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలనపై వైయస్ జగన్ దృష్టిసారించారు. 

జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలా అన్న కోణంలో వైయస్ జగన్ ఆలోచిస్తున్నారు. ఇంతలో జగన్ కు ఒక శుభవార్త అందింది. 

ఏపీలో 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీకానున్నాయి. ఆ 5 ఎమ్మెల్సీ పదవులు కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటీవలే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మరో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు పయ్యావుల కేశవ్. దీంతో ఆయన కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవిపొంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఒంగోలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి ఘన విజయం సాధించారు. 

ఇలా తెలుగుదేశం పార్టీ నుంచి మూడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఇకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆళ్లనాని తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. 

అలాగే కోలగట్ల వీరభద్ర స్వామి స్థానం కూడా ఖాళీ కాబోతుంది. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎంపికైన కోలగట్ల వీరభద్రస్వామి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

ఇకపోతే ఏలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆళ్లనాని పదవీకాలం 2022 మార్చి 29తో ముగియనుండగా కోలగట్ల వీరభద్రస్వామి పదవీ కాలం 2021 మార్చి 29తో ముగియనుంది. ఇకపోతే ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో కరణం బలరాం ఎన్నికయ్యారు. 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామి, కరణం బలరాం. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి.  మెుత్తం ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

అసెంబ్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ సభ్యుల సంఖ్య 151 కావడంతో దాదాపు అన్ని స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. ఎమ్మెల్యే కోటాలో కరణం బలరాం, ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామి వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు సీఎం వైయస్ జగన్.

అయితే స్థానిక సంస్థల కోటా నుంచి పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తారా లేక స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం నియమిస్తారా అన్నది సందిగ్ధత నెలకొంది. 

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎన్నిక నిర్వహిస్తే మరో రెండు కలిసి వైసీపీ ఖాతాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఈ అంశం ఎన్నికల సంఘం నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో తొలుత మూడు ఎమ్మెల్సీలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే. 

ప్రస్తుతానికి శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బలాల సంఖ్య 31గా ఉంది. అయితే కరణం బలరాం, పయ్యావుల కేశవ్, మాగుంట శ్రీనివాసులరెడ్డిల రాజీనామాతో ఆ బలం కాస్త 29కి పడిపోయింది. ప్రస్తుతం శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 8మంది. మరో ముగ్గురు వచ్చి చేరితే ఆ బలం కాస్త 11కు చేరనుంది.