రాజులు, రాజ్యాలు, పురాతన వస్తువులంటే మనలో చాలామందికి మోజు. అయితే కొందరి బలహీనతను కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అచ్చం ఇదే తరహాలో రాజుగారి హారమని చెప్పి.. రూ.5 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడో మాయగాడు.

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం మాముడూరుకు చెందిన గఫూర్ అనే వ్యక్తి గత నెల 13వ తేదీన నెల్లూరుకు బైక్‌పై వెళుతున్నారు. మార్గమధ్యంలో సంగం మండలం గాంధీజన సంఘం వద్ద ముగ్గురు వ్యక్తులు పిట్టలు అమ్ముతూ కనిపించారు.

దీంతో వారి వద్దకు వెళ్లి తమకు పిట్టలు కావాలని అడిగారు. అయితే అప్పటికే కౌజు పిట్టలు అయిపోయాయని.. తాము తిరిగి వేటకు వెళ్తున్నామని దొరికితే తీసుకొస్తామని చెప్పడంతో.. యువకులు ఫోన్ నెంబర్లను వారికిచ్చారు.

ఈ క్రమంలో గత నెల 26వ తేదీన ఫోన్ చేసి.. మాకు మైసూరు వద్ద తవ్వకాలు చేస్తుండగా విలువైన హారం దొరికిందని.. ఇది రాజుగారు ధరించినది చెప్పారు. అంతేకాకుండా దానిని పంచుకోవడం సాధ్యం కాకపోవడం వల్ల.. హారాన్ని అమ్మేసి నగదును పంచుకుంటామని చెప్పారు.

మీరు తెలిసిన వ్యక్తి కావడం వల్ల తక్కువ ధరకే అమ్ముతామని చెప్పాడు. అయితే వారి మాటలను గఫూర్ నమ్మలేదు...నాణ్యత కావాలంటే తనిఖీ చేయించుకోవచ్చునని చెప్పారు.

చివరికి ఎలాగోలా బుట్టలో పడ్డ గఫూర్ గాంధీ జనసంఘం వద్ద వారిని కలిశాడు. ఆ ముగ్గురు వ్యక్తులు హారంలోని గుళ్లను తెంచి పరీక్షించుకోమని ఇచ్చారు. సంగంలో నాణ్యతా పరీక్ష అనంతరం గఫూర్ సంతృప్తి చెంది.. రూ.5 లక్షలకు హారాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

గత నెల 31వ తేదీన సొమ్ము మొత్తం అప్పగించిన గఫూర్ వారి నుంచి హారాన్ని తీసుకుని ఇంటికెళ్లాడు. అక్కడ ఆయన అనుమానం వచ్చి మరోసారి తనిఖీ చేయగా.. అది పుత్తడి కాదని.. ఇత్తడి అని తేలడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.