Asianet News TeluguAsianet News Telugu

అల్లూరి జిల్లాలో ఘోరం... లోయలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు దుర్మరణం

అల్లూరి జిల్లా పాడేరు వద్ద ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు లోయలో పడి భార్యాభర్తలతో పాటు డ్రైవర్ దుర్మరణం చెందాారు. 

Three killed and one injured in road accident in Alluri District AKP
Author
First Published Apr 27, 2023, 10:18 AM IST

పాడేరు : ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో భార్యాభర్తలతో సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలాగాడ గ్రామానికి చెందిన చెండా సుబ్బారావు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్ఐసి) లో అడిషనల్ డివిజనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఉద్యోగ నిమిత్తం భార్య మహేశ్వరి, పిల్లలతో కలిసి విశాఖపట్నంలో నివాసముండేవాడు. అయితే గంగదేవత జాతర వుండటంతో దంపతులిద్దరు సమీప బంధువు పూర్ణచంద్రారావుతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులతో కలిసి ఆనందంగా జాతర జరుపుకున్నారు. మంగళవారం జాతర ముగియడంతో వీరంతా బుధవారం రాత్రి విశాఖపట్నంకు తిరుగు పయనం అయ్యారు. 

అయితే పాడేరు ఘాట్ రోడ్డులో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. వంట్లమామిడి సమీపంలోని కోమలమ్మ పనుకు దగ్గరగల మలుపులో కారు అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టి లోయలోకి పడిపోయింది. దీంతో కారు డ్రైవర్ ఉమామహేశ్వరరావు, చెండా మహేశ్వరి అక్కడిక్కడే మృతిచెందగా సుబ్బారావు హాస్పిటల్లో మృతిచెందారు. 

Read More  విశాఖ ఆర్‌కే బీచ్ లో యువతి డెడ్ బాడీ కలకలం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి తీవ్రంగా గాయపడిన సుబ్బారావు, పూర్ణచంద్రరావును అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. కానీ పాడేరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సుబ్బారావు మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన పూర్ణచంద్రారావు పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. 

సుబ్బారావు-మహేశ్వరి దంపతుల మృతితో స్వగ్రామం కిలగడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొన్ని గంటల ముందే వెళ్లినవారు ఇప్పుడిలా విగతజీవులుగా తిరిగిరావడం చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. డ్రైవర్ ఉమామహేశ్వరరావు స్వగ్రామం కంచరపాలెంలోనూ విషాదం నెలకొంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios