చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతులను కర్ణాటకకు చెందిన పోలీసులుగా గుర్తించారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతులను కర్ణాటకకు చెందిన పోలీసులుగా గుర్తించారు. వివరాలు.. జిల్లాలోని పూతలపుట్టు సమీపంలో కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కర్ణాటకు చెందిన ముగ్గురు పోలీసులు ఈ ప్రమాదంలో మృతిచెందినట్టుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను పట్టుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చిత్తూరు జిల్లాలో జరిగి రోడ్డు ప్రమాదంలో తమ రాష్ట్ర పోలీసులు మరణించినట్టుగా కర్ణాటక హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ధ్రువీకరించారు. చిత్తూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసు సిబ్బంది మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని ఆరగ జ్ఞానేంద్ర తెలిపారు. వారు బెంగళూరులోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. క్షతగాత్రులను ఆదుకోవాలని, మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే పోలీసు సిబ్బంది మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు.
అయితే మంత్రికి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. చిత్తూరులో డ్రగ్స్ వ్యాపారిని పట్టుకునేందుకు పోలీసు సిబ్బంది వెళ్తుండగా వారి కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కర్ణాటక నుంచి ఓ పోలీసు బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. మృతదేహాలను, క్షతగాత్రులను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు.
