పొలంలో మోటార్ కోసం వెళ్లి ముగ్గురురైతులు వాగులో చిక్కుకుపోయారు. మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగి ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. ఈ సంఘటన చిత్తూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా  ఉన్నాయి.

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం డిక్షన్ సమీపంలో ముగ్గురు రైతులు వాగులో చిక్కుకుపోయారు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది తో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 

రేణిగుంట డీఎస్పీ, సీఐ సహా ఇతర అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రప్పించి లేదా హెలికాప్టర్ సాయంతో రైతులను బయటకు తీసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. కాగా మల్లెమడుగు రిజర్వాయర్ నిండిపోవడంతో నీటి ఉధృతి పెరిగితే బాధితులను కాపాడటం కష్టతరం కావొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక నివర్‌ తుపాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. చాలా ప్రాంతాలో ఈ తుఫాను కారణంగా వర్షాలు కూడా పడుతున్నాయి.