Asianet News TeluguAsianet News Telugu

నకిలీ చలానాల కేసు : ముగ్గురు డాక్యుమెంట్ రైటర్ల అరెస్ట్...

నిందితుల నుంచి రూ. 67 లక్షలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.  నిందితుల నుంచి  లాప్టాప్ లు, ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

three document writers arrested in fake challan case in amravati
Author
Hyderabad, First Published Aug 20, 2021, 1:25 PM IST

అమరావతి : నకిలీ చలానాల కేసులో కడప సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను పోలీసులు అరెస్టు చేశారు. జింకా రామకృష్ణ,  లక్ష్మీనారాయణ, గురు ప్రకాష్ లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ చలానాలతో వీరు కోటి మూడు లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు.  

నిందితుల నుంచి రూ. 67 లక్షలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.  నిందితుల నుంచి  లాప్టాప్ లు, ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 
ఏసీబీ దాడులు చేస్తే తప్ప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల విషయం వెలుగులోకి రాలేదని,  అసలు ఈ వ్యవహారం ఎన్ని రోజులనుంచి జరుగుతుందోనని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మన దృష్టికి ఎందుకు రావడం లేదు?  బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?  క్షేత్రస్థాయిలో వ్యవస్థలు స్వయంగా నడుస్తూ ఉన్నాయో, లేవో ఎందుకు చూడడం లేదు?  ప్రభుత్వ శాఖల్లోని అవినీతికి అడ్డుకట్ట వేయాలి.  అవసరమైతే క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకోండి అని సూచించారు. 

నకిలీ చలానాల స్కామ్.. ఏసీబీ దిగితే కానీ బయటపడలేదు, మీరంతా ఏం చేస్తున్నారు: అధికారులపై జగన్ ఆగ్రహం

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో చలాన్ల స్కాం చోటు చేసుకొందని ఆ శాఖ ఐజీ శేషగిరి బాబు చెప్పారు. ఈ కుంభకోణంపై  ఏపీ సీఎం కూడ ఆరా తీశారు. విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలాన్ల కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై దర్యాప్తులో తేలుతుందని ఐజీ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.

నకిలీ చలాన్ల స్కాం కారణంగా రూ. 5 కోట్లకుపైగా ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఇందులో కోటి రూపాయాలను ఇప్పటికే రికవరీ చేశామన్నారు.  రాష్ట్రంలోని 10 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఈ చలాన్ల కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. ఏడు కార్యాలయాల్లో చాలా తక్కువ మొత్తంలోనే కుంభకోణం జరిగిందన్నారు. బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం  చేయాలనే దానిపై కూడ న్యాయ సలహా తీసుకొంటున్నామని ఆయన చెప్పారు.  రాష్ట్రంలోని అన్ని ఎస్ఆర్ఓలలో కొత్త సాఫ్ట్‌వేర్ ను అమల్లోకి తీసుకొచ్చామన్నారు. వారం రోజులుగా కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని ఆయన చెప్పారు.

ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫేక్ చలానాల వ్యవహారం ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనూ వెలుగు చూసింది. నాయుడుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు పెద్ద ఎత్తున ఫేక్ చలానాలు కనిపించాయి. వీటి సాయంతో భూ బదలాయింపులు, ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సుమారు రూ.5 లక్షల విలువ చేసే  నకిలీ చలానాల ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు చిత్తూరు జిల్లాకు చెందిన ఆడిట్ సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ గుర్తించారు. ప్రస్తుతం ఇక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని మిగిలిన చోట్ల కూడా తనిఖీలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios