Asianet News TeluguAsianet News Telugu

నకిలీ చలానాల స్కామ్.. ఏసీబీ దిగితే కానీ బయటపడలేదు, మీరంతా ఏం చేస్తున్నారు: అధికారులపై జగన్ ఆగ్రహం

నకిలీ చలానాల కుంభకోణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప.. ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని మండిపడ్డారు. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో అధికారులు పట్టించుకోవడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అన్ని కార్యాలయాల్లో చలాన్ల ప్రక్రియను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

ap cm ys jagan serious on fake challan scam
Author
Amaravathi, First Published Aug 19, 2021, 3:37 PM IST

రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ చలానాల కుంభకోణంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి నకిలీ చలానాలు ఎలా  వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప.. ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదని మండిపడ్డారు. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో లేదో అధికారులు పట్టించుకోవడం లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అన్ని కార్యాలయాల్లో చలాన్ల ప్రక్రియను పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాల్ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌పై అధికారులు దృష్టిపెట్టాలని జగన్ సూచించారు. చలాన్ల అక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. మీ సేవ ఆఫీసుల్లో పరిస్థితులపైనా అధికారులు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 17 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో చలాన్ల స్కాం చోటు చేసుకొందని ఆ శాఖ ఐజీ శేషగిరి బాబు చెప్పారు. ఈ కుంభకోణంపై  ఏపీ సీఎం కూడ ఆరా తీశారు. విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చలాన్ల కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయమై దర్యాప్తులో తేలుతుందని ఐజీ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.

ALso Read:నెల్లూరు జిల్లాలోనూ వెలుగులోకి నకిలీ చలానాల బాగోతం.. ప్రభుత్వానికి రూ.5 లక్షల టోకరా

నకిలీ చలాన్ల స్కాం కారణంగా రూ. 5 కోట్లకుపైగా ఖజానాకు నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఇందులో కోటి రూపాయాలను ఇప్పటికే రికవరీ చేశామన్నారు.  రాష్ట్రంలోని 10 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఈ చలాన్ల కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. ఏడు కార్యాలయాల్లో చాలా తక్కువ మొత్తంలోనే కుంభకోణం జరిగిందన్నారు. బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం  చేయాలనే దానిపై కూడ న్యాయ సలహా తీసుకొంటున్నామని ఆయన చెప్పారు.  రాష్ట్రంలోని అన్ని ఎస్ఆర్ఓలలో కొత్త సాఫ్ట్‌వేర్ ను అమల్లోకి తీసుకొచ్చామన్నారు. వారం రోజులుగా కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారానే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios