కర్నూలు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. కాలినడకన వెళుతున్న భక్తులకు దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఎర్రగుడి గ్రామానికి చెందని 42 మంది భక్తులు ఉగాది సందర్భంగా స్వగ్రామం నుంచి కాలినడకన శ్రీశైలం బయలుదేరారు.

ఈ క్రమంలో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల సమీపంలో బుధవారం ఉదయం వీరిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి కొద్దిదూరంలో ఈదులదేవరబండ గ్రామస్థులు లారీని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కొద్దినిమిషాల ముందు కప్పట్రాళ్ల స్టేజ్ వద్ద మరో ఇద్దరు పాదచారాలపైకి వెళ్లడంతో వారు గాయపడ్డారు.