కడప: ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 16 మంది మృత్యువాత పడిన ఘటన మరవక ముందే అటువంటి సంఘటనే కడప జిల్లాలో చోటు చేసుకుంది. మత్తు కోసం కడప జిల్లాలోని పెండ్లిమర్రి గ్రామంలో శానిటైజర్ తాగి ముగ్గురు మరణించారు. 

చెన్నకేశవులు అనే వ్యక్తి ఆదివారం మరణించగా, భీమయ్య, ఓబులేష్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. వారిలో చెన్నకేశవులు ఇంటి వద్ద మరణించగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. శానిటైజర్ తాగాడనే విషయాన్ని వారు గోప్యంగా ఉంచారు. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

ఓబులేష్ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భీమయ్య ఇంటి వద్దనే మరణించాడు. భీమయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ కు తరలించారు. మొత్తం 8 మంది శానిటైజర్ తాగినట్లు భావిస్తున్నారు. మిగిలినవారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం రోజులుగా వారు శానిటైజర్ తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.