Viveka Murder: సీఎం జగన్ నుంచి ప్రాణహాని.. కోర్టులో దస్తగిరి పిటిషన్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్ పిటిషన్ వేశాడు. తనకు, తన కుటుంబానికి సీఎం జగన్ నుంచి ప్రాణ హాని ఉన్నదని పిటిషన్ దాఖలు చేశాడు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ రాజకీయంగా కలకలం రేపే కేసు వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసులో ప్రతి పరిణామం అందరూ గమనిస్తున్నారు. ప్రతి పరిణామాన్ని దగ్గరగా చూస్తున్నారు. ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సీబీఐ కోర్టులో ఓ పిటిషన్ వేశాడు. తనకు సీఎం జగన్ నుంచి ప్రాణ హాని ఉన్నదని, తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరాడు.
సీబీఐ కోర్టులో దస్తగిరి ప్రొటెక్షన్ పిటిషన్ వేశాడు. తనకు ప్రాణ హాని ఉన్నదని, అందుకే రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరాడు. తనకు, తన కుటుంబానికి సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, అవినాశ్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన కొడుకు చైతన్య రెడ్డిల నుంచి ప్రాణ హాని ఉన్నదని పిటిషన్ వేశాడు.
కాబట్టి, తమను రక్షించేలా సీబీఐ కోర్టు ఆదేశించాలని విజ్ఞప్తి చేశాడు. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. కాగా, ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: మహాత్మా గాంధీ ఆశ్రమం అప్పుడు.. ఇప్పుడు !
ఎన్నికలు సమీపిస్తున్న వేళ దస్తగిరి ఈ పిటిషన్ వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్నది. ఇది వరకే ప్రతిపక్షాలు వివేకా హత్య కేసు విషయంలో జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.