ఏపీలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారు.. దీని వెనక ఉన్న శక్తులెవరు - సాధినేని యామినీశర్మ
ఏపీలో కనిపించకుండా పోతున్న వేలాది మంది మహిళలు ఏమైపోతున్నారని బీజేపీ మహిళా మోర్చా ఏపీ మీడియా కన్వీనర్ సాధినేని యామినీశర్మ అన్నారు. వీరి అదృశ్యం వెనక ఎవరున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారని, దీని వెనక ఉన్న శక్తులు ఎవరు అని బీజేపీ మహిళా మోర్చా ఏపీ మీడియా కన్వీనర్ సాధినేని యామినీశర్మ ప్రశ్నించారు. ఏపీలో అదృశ్యాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన లెక్కలను పరిశీలిస్తే.. స్త్రీల భద్రత చాలా ప్రమాకరంగా ఉందని స్పష్టమవుతోందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు యామినీ శర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళకు హోం మినిస్టర్ పదవి ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడమే కానీ.. వైసీపీ ప్రభుత్వం మహిళ రక్షణ కోసం చేసిందేమీ లేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో స్త్రీలు నిజంగానే తప్పిపోతున్నారా లేక ఎవరైనా తప్పిస్తున్నారా అని యామినీ అనుమానం వ్యక్తం చేశారు. లేకపోతే మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారా అని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని ఇంత మంది ఆడ బిడ్దలు కనిపించకుండా పోవడానికి కారణమేంటని ఆమె అన్నారు. వారంతా ఏమైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిర్భయ చట్టం అమలు చేసేందుకు కేంద్రం నిధుల ఇస్తోందని, కానీ ఇప్పటికీ వాటిని ప్రభుత్వం ఖర్చు చేయలేకపోతోందని యామినీ ఆరోపించారు. ఇలాంటి స్థితిలో ఏపీ ప్రభుత్వం ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం అని దిశ అనే ఒక యాప్ పెడితే సరిపోదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులకు నోటీసులు పంపించడంలో ఏపీ మహిళా కమిషన్ ఉత్సాహాన్ని చూపుతోందని ఆరోపించారు. కానీ మహిళకు రక్షణ అందించడంలో మాత్రం విఫలం అయ్యిందని పేర్కొన్నారు.