రామచంద్రపురం: తెలుగుదేశం పార్టీ వీడతారంటూ వస్తున్న వార్తలపై రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీ వీడేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ లు తెలుగుదేశం పార్టీ వీడితే తాను వీడిపోతానంటూ వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. ఆమంచి, అవంతి శ్రీనివాస్ లు తనకు మంచి స్నేహితులు  అని చెప్పుకొచ్చారు. 

స్నేహం వేరు, రాజకీయాలు వేరు అని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్నేహంతోనే తన కుమారుడి వివాహ రిసెప్షన్ కోసమే వచ్చారని స్పష్టం చేశారు. తలసాని రావడం వెనుక రాజకీయ వ్యూహాలు ఏమీ లేవన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని అందులో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు.