గత కొద్ది రోజులగా వైసీపీ నేత, మాజీ ఎంపీ తోట నరసింహం పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ పెద్దలు ఆయనను సంప్రదించారని.. త్వరలోనే ఆయన పార్టీ మారతారంటూ వార్తలు ఊపందుకున్నాయి. తొలుత తోట నరసింహం భార్య పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఆయన కూడా కమలం గూటికి చేరిపోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా...  ఈ వార్తలపై తాజాగా తోట నరసింహం స్పందించారు.

పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే తన కుటుంబం నడుచుకుంటుందని ఆయన వివరించారు. ఆర్‌బీ పట్నం గ్రామంలో బుధవారం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో తాము పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో తోట రాంజీ, తుమ్మల రాజా పాల్గొన్నారు.