తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది.
తెలుగుదేశంపార్టీ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే అపరిచితుడు సినిమాలో హీరోకున్నట్లు స్ప్లిట్ పర్సనాలిటీలు. రాష్ట్ర రాజకీయాల్లో తాము మాత్రమే పాదరసం లాంటి స్వచ్ఛమైన వాళ్ళమని వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టేసుకుంటూ ఉంటారు. అంత వరకూ అయితే ఎలాగో భరించేయోచ్చు వాళ్ళని. వాళ్ళల్లో కూడా అనేక బొక్కలు పెట్టుకుని ఎదుటి వాళ్ళ బొక్కలని బూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు అందరికీ. అందులోనూ జగన్ విషయంలో అయితే చెప్పనే అక్కర్లేదు మరీ రెచ్చిపోతారు.
తాజాగా వెలుగు చూసిన ప్యారడైజ్ పేపర్ల విషయంలో జరుగుతన్నది అదే. అసలా పనామా పేపర్లేంటో ఎవరికీ సరిగ్గా తెలీదు. అందులో ఏముందో కూడా పూర్తిగా ఎవరూ చూడలేదు. ప్యారడైజ్ పేపర్లలో ప్రపంచంలోని అవినీతిపరుల్లో కొందరు గురించి వివరాలున్నాయట. అందులో జగన్ అవినీతి గురించి కూడా ప్రస్తావన ఉందట. ఇంకేం కావాలి ఈ అపరిచితులకు. పచ్చ మీడియా సహకారంతో రెండు రోజులుగా రెచ్చిపోతున్నారు.
మంత్రులు యనమలరామకృష్ణుడు, సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి, అచ్చెన్నాయుడు, కళావెంకట్రావు, కాలువశ్రీనివాసులు తెగ మాట్లాడేస్తున్నారు. జగన్ జనసంకల్పయాత్ర రెండు రోజుల క్రితం మొదలైంది. అందులోనూ జనాల స్పందన బ్రహ్మండంగా ఉండటం, అదే సమయంలో ప్యారడైజ్ పేపర్లంటూ వార్తలు వెలుగు చూడటంతో మరీ రెచ్చిపోతున్నారు.
విచిత్రమేమిటంటే తమ పార్టీలో ఉన్న అవినీతిపరుల గురించి మాత్రం మాట్లాడరు. వాళ్ళ విషయాన్ని ఎవరైనా ప్రస్తావించినా ఘజనీ సినిమాలో హీరో లాగ మారిపోతారు. జగన్ అవినీతి గురించి, అక్రమ సంపాదన గురించి ఇప్పటికే సిబిఐ నమోదు చేసిన కేసులపై కోర్టులో విచారణలో జరుగుతోంది. ఆ కేసులు విచారణ పూర్తయితే కానీ తేలదు జగన్ నీతిమంతుడా కాదా అని. ఈలోగా టిడిపి నేతలే జగన్ ను అవినీతిపరునిగా ముద్ర వేసేసి ఎంత శిక్ష పడుతుందో కూడా ఫైనల్ చేసేసారు.
ఇదే నేతలకు కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపి రాయపాటి సాంబశివరావు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఎంఎల్సీలు వాకాటి నారాయణరెడ్డి, శ్రీనివాస్ లు బ్యాంకులను వందల కోట్లరూపాయలకు మోసం చేసిన వైనం గుర్తే ఉండదు. ఎంతోమంది టిడిపి ఎంఎల్ఏలు ఇసుక కుంభకోణంలో కోట్ల రూపాయలు సంపాదించినట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. అంతెందుకు ‘ఓటుకునోటు’ కేసులో చంద్రబాబునాయుడు పాత్ర మాటేమిటి ? మనదేశంలో ఏ వ్యవస్ధకైనా వేటి పని అవి చేసుకునే స్వేచ్ఛ లేనంత వరకూ ఇలాంటి అపరిచితులు, ఘజనీ లాంటి నేతలకు కొదవే ఉండదు.
