Asianet News TeluguAsianet News Telugu

ఆ ఐదు శాఖలంటే పవన్ కల్యాణ్ కు ఎందుకు ఇష్టమో తెలుసా..?

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయానికి కీలకంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి.. చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా, ఐదు శాఖల మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నారు. ఆ శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలిపారు.   

Those ministries are very close to my heart and Jana Sena's core ideologies - Pawan Kalyan GVR
Author
First Published Jun 15, 2024, 9:16 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలైన సేవలు అందించే భాగ్యం తనకు కలిగిందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గతంలో ప్రజల సమస్యలను చూశానని.... వాటన్నింటినీ పరిష్కరించేందుకు అనువైన శాఖల బాధ్యతలు తాను నిర్వర్తించనుండటం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటిని అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానన్నారు...

పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే...
‘‘ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక.. ఈ శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా భావిస్తున్నాను. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి ఉన్నాను. 2019 ఎన్నికలకు ముందు ప్రజా పోరాట యాత్రను ప్రజల సమస్యల అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసమే తలపెట్టాను. చాలా లోతుగా ఆనాడు స్వయంగా పరిశీలన జరిపాను. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతీ ప్రాంత సమస్యలపై బలమైన అవగాహన ఏర్పడింది.’’

Those ministries are very close to my heart and Jana Sena's core ideologies - Pawan Kalyan GVR

గ్రామాల్లో సమస్యలు కళ్లారా చూశా... 
‘‘విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని చూపించారు. ఆ ప్రాంతంలోనే తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరివాళ్ళు వివరించారు. గోదావరి జిల్లాలకు వెళ్లినప్పుడు పలు మత్యకార గ్రామాలవాసులు తాగు నీటి కోసం ఎన్ని ప్రయాసలుపడుతున్నామో చెప్పారు. గ్రామీణ అభివృద్ధి - దేశాభివృద్ధి అనే నినాదం నామమాత్రంగా మిగిలిపోవడాన్ని గమనించాను. గుక్కెడు మంచి నీరు కోసం మైళ్ళ దూరం వెళ్లి ప్రయాసతో బిందెడు నీరు తెచ్చుకుంటున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కాలుష్యమయమైన జల వనరులనే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో  వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను.’’
‘‘గతేడాది గ్రామ సర్పంచులతో జనసేన కేంద్ర కార్యాలయంలో చర్చాగోష్టి నిర్వహించాం. పార్టీలకు అతీతంగా వందల మంది సర్పంచులు పాల్గొన్నారు.  నాటి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల నిధులను ఏ విధంగా మళ్లించేసిందీ వివరిస్తూ తాము నిధులు, అధికారాలు లేక ఏ విధంగా చేష్టలుడిగిపోయి ఉన్నామో చెప్పారు. స్థానిక సంస్థల చట్టాలు, విధులు, నిధుల వినియోగంపై సాధికారత కలిగిన చెల్లప్ప గారు, డా.ఈడిగ వెంకటేష్ గారు లాంటి మేధావులు, ఆచార్యులతో కూడా ఆ రోజు చర్చించాం. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తాను.’’

పర్యావరణం పార్టీ సిద్ధాంతాల్లో భాగం...
‘‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకపక్క పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరగాలి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా అందాలి అని నేను గట్టిగా కోరుకుంటున్నాను. అయితే ఆ అభివృద్ధి పర్యావరణానికి హితంగా జరగాలి. ఆధునిక సాంకేతికత మేళవించిన సురక్షితమైన పారిశ్రామిక అభివృద్ధి ఈ సమాజానికి అవసరం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని మనం ఏనాడూ మరచిపోలేము. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా పరిశ్రమలు ముందుకు వెళ్ళడానికి చేయూతనిస్తాము. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలుస్తాము. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తాము.’’

అటవీ సంపదను కాపాడుకుందాం...
‘‘వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి నా మదిలో ఎప్పుడూ మారుమోగుతుంటుంది. ఒక్క వృక్షాన్ని రక్షించుకుంటేనే మానవ కోటికి ఎంతో మేలు కలుగుతున్నప్పుడు.. మరి లక్షలాది వృక్షాలను తన గర్భాన నిలుపుకున్న అడవి తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. అడవుల విధ్వంసమే కరువు కాటకాలకు హేతువు. అటువంటి అడవులను కంటికి రెప్పలా కాపాడతాము. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతాము. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందే. సామాజిక వనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. శాస్త్ర, సాంకేతిక విభాగాలు మానవాళి శ్రేయస్సుకు, లోక కళ్యాణానికి అత్యంత అవశ్యం.’’

ప్రజా పంపిణీ, ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి...
అలాగే, జనసేన పార్టీ నుంచి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించబోయే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లకు ప్రజా ప్రయోజనం కలిగిన, అభివృద్ధి సంబంధిత శాఖలు అప్పగించారు. పౌర సరఫరాలు, టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలు  కేటాయించడం సంతోషంగా ఉంది. 
నాదెండ్ల మనోహర్ నిర్వర్తించే ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాము. ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేస్తాము. రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై ప్రత్యేక దృష్టిపెడతాము. అదే విధంగా రైతుల నుంచి పంటల కొనుగోలు విధానం, వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అవలంబిస్తాము. రాష్ట్రంలో వరి రైతులకు పంట కొనుగోలు డబ్బులు అందించడంలో గత ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య పోకడలు, రైతుల వేదనలు స్వయంగా చూశాను. ఆ పరిస్థితులు రానీయము.’’

పర్యాటక ప్రాజెక్టులతో ఉపాధి అవకాశాలు...
‘‘రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి. ఆహ్లాదకర పర్యాటకంతోపాటు, ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధిపై దృష్టి పెడతాము. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు రాష్ట్రానికి ఒక బ్రాండ్ కల్పించడంపై దృష్టిపెట్టాలి. అదే విధంగా సినిమా రంగానికి రాష్ట్రంలో ప్రోత్సాహకరం, స్నేహపూరిత వాతావరణం తీసుకువస్తాము. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తాము. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుగావడానికి ఎనలేని సహకారం అందించిన ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ గారికి, ప్రజలతో  నేరుగా సంబంధ భాందవ్యాలు కలిగిన మంత్రిత్వ శాఖలు కేటాయించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
జనసేన పార్టీకి కేటాయించిన శాఖల ద్వారా చిత్తశుద్ధితో ప్రజా సేవలు అందిస్తాము. నేను నిర్వర్తించబోయే శాఖలపై మరింత లోతైన అధ్యయనం జరిపి ప్రజలకు అత్యంత మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేని కృషి చేస్తానని 5కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సవినయంగా తెలియచేస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios