‘మనవాళ్ళు బ్రీఫ్ మీ’ అన్న మాట ఒక్కటి చాలు చంద్రబాబు పాత్ర ఏమిటో చెప్పటానికి.

చంద్రబాబునాయుడు ‘నేడు శశి..రేపు జగన్’ అని ఏ ఉద్దేశ్యంతో చెప్పారో కానీ గురివింద గింజ సామెతను గుర్తుకుతెస్తోంది. చట్టం నుండి న్యాయం నుండి ఎవరూ తప్పించుకోలేరని ఎన్నో సినిమాల్లో కొన్ని వందల సార్లు అందరూ విన్న డైలాగులే. అయితే, చంద్రబాబు చెబుతున్న శశి-జగన్ ల ఉదాహరణ తనకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని మరచిపోయారా? ‘ఓటుకునోటు’ కేసు గురించి ఎవరిని అడిగినా చెబుతారు కదా? విచారణ ముందుకు సాగకుండా చంద్రబాబు స్టే తెచ్చుకున్న విషయాలు అందరికీ తెలిసిందే. ‘మనవాళ్ళు బ్రీఫ్ మీ’ అన్న మాట ఒక్కటి చాలు చంద్రబాబు పాత్ర ఏమిటో చెప్పటానికి.

వ్యవస్ధలను మేనేజ్ చేయటం ద్వారా కేసులు, విచారణలు, శిక్షలనుండి తప్పించుకోవాలనుకున్న వారు ఏపిలో శిక్షణ తీసుకుంటే సరిపోతుంది. కుప్పంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం పోరాడితే అధికారంలోకి వచ్చామన్నారు. పోరాటాల ద్వారా కాదు తప్పుడు హామీల ద్వారానే అధికారంలోకి వచ్చారని వైసీపీ అంటోంది. అధికారంలోకి వచ్చినదగ్గర నుండి నేతల్లో మొదలైన విచ్చలవిడితనం వల్లే మనల్ని మనమే ఓడించుకుంటామని చంద్రబాబు చెప్పిన మాట వాస్తవమయ్యేట్లుంది.

‘తప్పు చేసి ఎవ్వరూ తప్పించుకోలేర’ని అంటూనే శశికళ, జగన్లను ఉదాహరణగా చెప్పిన చంద్రబాబు ఆ సూత్రం తనకు మాత్రం వర్తించదని అనుకున్నారేమో. 1995-96 కేసులో శశికళకు శిక్ష పడితే, రూ. 40 వేల కోట్ల అవినీతిలో జగన్ బయటపడే సమస్యే లేదని చంద్రబాబు తేల్చేసారు. మొన్నటి వరకూ ఇదే చంద్రబాబు అండ్ కో జగన్ అవినీతి లక్ష కోట్లని చెప్పారు. సరే, శశికళకు శిక్షపడిందంటే అవినీతి నిరూపణైంది. మరి, జగన్ విషయంలో ఇంత వరకూ ఒక్క కేసు కూడా నిరూపణ కాలేదే? జగన్ కేసుల్లో పలువురు అధికారుల, పారిశ్రామికవేత్తల పాత్రకు ఆధారాలు లేవని కోర్టు కొట్టేస్తున్న విషయాలు చంద్రబాబుకు తెలీదా?

ఇక, నేతలు పార్టీపైన, ప్రజలపైన శ్రద్ధ పెట్టటం లేదని ఆవేధన వ్యక్తం చేయటంలో నిజముంది. మంత్రులతో సహా నేతలెవరూ జనాలకు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా ఎంఎల్ఏలే బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. మన ప్రవర్తన బాగుండాలని బుద్దులు చెబుతున్న చంద్రబాబుకు, చింతమనేని ప్రభాకర్, రావెల కిషోర్ బాబు, బోడె ప్రసాద తదితరుల ల వ్యవహారాలు గుర్తుకురావటం లేదా? ‘ప్రజావ్యతరేక నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులు పెడితే, ఎన్నికల్లో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతార’ని చంద్రబాబు చెప్పిన మాటలన్నీ భవిష్యత్తుకు సూచనలు కావుకదా?