విశాఖ జిల్లాలో దొంగల బీభత్సం: ప్రయాణీకుల కార్లను అడ్డగించి దోపీడీ
విశాఖపట్టణం ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో దోపీడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ప్రయాణీకుల కార్లను అడ్డగించి బంగారం, నగదును దోచుకొన్నారు.
విశాఖపట్టణం: విశాఖపట్టణం ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి మండలం ధారకొండ ఘాట్‌రోడ్డులో దోపీడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ప్రయాణీకుల కార్లను అడ్డగించి బంగారం, నగదును దోచుకొన్నారు.
మంగళవారం నాడు అర్ధరాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజామువరకు దొంగలు దోపీడీకి పాల్పడ్డారు. రోడ్లపై వస్తున్న వాహనాలను ఆపి దోచుకొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గూడెం కొత్తవీధిలో పంచాయితీరాజ్ ఏఈఈగా పనిచేస్తున్న కిల్లో జ్యోతిబాబు మంగళవారం నాడు ఉదయం తన స్నేహితులైన ముగ్గురు ఉపాధ్యాయులతో కలిసి చింతపల్లి నుండి కారులో సీలేరు వెళ్లారు.
సచివాలయం భవనం శ్లాబ్ పనులు పరిశీలించి రాత్రి ఏడున్నర గంటల సమయంలో చింతపల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. ధారకొండ ఘాట్‌రోడ్డులో మూడో మలుపు వద్దకు కారు చేరుకోగానే రోడ్డుకు అడ్డంగా బండరాళ్లను కారు నడిపై అర్జున్ చూశాడు.
అనుమానం వచ్చిన అర్జున్ కారును రివర్స్ చేస్తున్న సమయంలో రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లో నుండి ముసుగులు ధరించిన వ్యక్తులు రోడ్డుపైకి వచ్చి కారు ముందు సీట్లో కూర్చొన్న వారికి నాటు తుపాకులు గురిపెట్టారు.
అయినా వారు కారును ఆపలేదు. దీంతో కారుపై కర్రలతో దాడికి దిగారు. అదే వేగంతో కారును ధారాలమ్మ ఆలయం వరకు చేరుకొన్నారు. అక్కడే ఉన్న వారికి విషయం చెప్పారు.
సీలేరుకు చెందిన వర్తకుడు కారే సత్యనారాయణ, ఈశ్వరమ్మ దంపతులు విశాఖపట్టణానికి వెళ్లడానికి బుధవారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకు కారులో బయలుదేరారు.ఉదయం ఐదున్నర గంటల సమయంలో ధారకొండ ఘాట్ రోడ్డు రెండో మలుపు వద్ద రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. తుపాకులతో బెదిరించారు. పోలీసులమని బెదిరించి సత్యనారాయణ, ఆయన భార్య మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తెంచుకొన్నారు. అదే సమయంలో అదే దారిలో ఆర్టీసీ బస్సు రావడంతో దుండగులు పారిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి ఐదుగురు ఇంజనీర్లు లంబసింగి వెళ్లడానికి కారులో బయలుదేరారు. ధారకొండ ఘాట్ రోడ్డుకు నాలుగు గంటల సమయానికి చేరుకొన్నారు. అయితే దుండగులు కారును అడ్డగించి నాలుగు సెల్ ఫోన్లు, రూ. 35 వేలు దోచుకొన్నారు. ఈ విషయాన్ని సప్పర్ల వద్ద గిరిజనులకు వారు చెప్పారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ధారకొండ ఘాట్ రోడ్డులో జరిగిన దోపీడీ ఘటనలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ రంజిత్ చెప్పారు. అమ్మవారి ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.