వృద్ధదంపతులపై దాడి...పుస్తెలతాడు తెంపి, తలగోడకేసి కొట్టి.. నగలు చోరీ.. !!
ఆంధ్రప్రదేశ్ లోని గాజువాకలో దారుణం జరిగింది. ఇనుప తుక్కు విక్రయించడానికి వచ్చినట్టు నటించిన ఇద్దరు వ్యక్తులు వృద్ధ దంపతులమీద దాడిచేసి, ఆభరణాలు దొంగిలించి పరారయ్యారు.
ఆంధ్రప్రదేశ్ లోని గాజువాకలో దారుణం జరిగింది. ఇనుప తుక్కు విక్రయించడానికి వచ్చినట్టు నటించిన ఇద్దరు వ్యక్తులు వృద్ధ దంపతులమీద దాడిచేసి, ఆభరణాలు దొంగిలించి పరారయ్యారు. బుధవారం గాజువాక హైస్కూలు రోడ్డులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గాజువాక క్రైం పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. ఎ.పేరయ్యశెట్టి (67), నాగమణి (60) దంపతులు.
ఇంటి దగ్గరే ఇనుప తుక్కు వ్యాపారం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నాగమణి దుకాణం మూసేస్తుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రాగి తీగలు తూకం వేయమన్నారు. నాగమణి మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి ఆమె మెడలోని పుస్తెల తాడును తెంపేశాడు. ఆమె ప్రతిఘటించడంతో తలపట్టుకుని గుంజి గోడకేసి కొట్టాడు.
మెడలో గొసులు సగం తెగి పడడంతో.. సుమారు తులం బరువున్న ముక్క ఆగంతకుడి చేతిలో ఉండిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న పేరయ్యశెట్టి వద్దకు మరోవ్యక్తి వెళ్లి దాడి చేసి, మెడలోని రెండు తులాల బంగారు గొలుసు తెంపాడు. దంపతులు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన బాధితురాలిని స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. నిందితులు రెండు రోజుల కిందటే తమ దుకాణానికిి వచ్చి ఇత్తడి సామాగ్రి ఇచ్చి డబ్బులు తీసుకెళ్లారని, ఉదయం కూడా వచ్చి దుకాణంలో కాసేపు కూర్చుని వెళ్లారని వారు పోలీసులకు వివరించారు.
ఈ ఘటన మీద డీసీపీ వీ సురేష్ బాు, ఏసీపీ పెంటారావు వివరాలు సేకరించారు. గాజువాక క్రైం సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.