దొంగతనానికి వచ్చి జనం వెంటబడటంతో ప్రమాదవశాత్తూ బావిలో పడిన ఓ దొంగ సుమారు 36 గంటలపాటు నరకయాతన అనుభవించి ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ముషినివలస పంచాయతీ కొప్పలపేట గ్రామంలోకి దొంగలు చొరబడ్డారని సమాచారం రావడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.

దీంతో ఇద్దరు అనుమానితులను గుర్తించిన గుర్తించిన గ్రామస్తులు వారి వెంటబడ్డారు. ఈ క్రమంలో ఒక దొంగ తప్పించుకోగా.. మరో వ్యక్తి పొలాల్లోకి పరుగులు తీస్తూ ప్రమాదవశాత్తూ 36 అడుగుల బావిలో పడిపోయాడు.

చీకట్లో కనిపించకపోవడంతో రెండో దొంగ కూడా తప్పించుకుని పారిపోయి ఉంటాడని గ్రామస్తులు భావించి వెనుదిరిగారు. అయితే దొంగ బావిలో పడిన వెంటనే నడుం విరిగిపోయి లేవలేని స్థితికి చేరుకున్నాడు.

ఏకంగా 36 గంటలపాటు తిండీతిప్పలు లేక బాగా నీరిసించిపోయాడు. గురువారం ఉదయం పొలాల్లోకి వెళుతున్న రైతులకి మూలుగులు వినిపించడంతో బావి దగ్గరికి వెళ్లి చూడగా దొంగ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పైకి తీశారు.

ఇతనిని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రెయ్‌వలసకు చెందిన ఆదినారాయణగా గుర్తించారు. చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతుంటాడని తెలుసుకున్న పోలీసులు ఆదినారాయణకు కౌన్సెలింగ్ ఇచ్చి పింపించారు.