Asianet News TeluguAsianet News Telugu

రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి.. : మోడీ, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాల‌పై కాంగ్రెస్ ఫైర్

Congress: గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందని ఆ పార్టీ నాయ‌కులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించలేకపోయిందన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసి రైతుల అవసరాలు తీర్చాలని డిమాండ్‌ చేశారు.
 

They are ignoring the welfare of farmers, Congress hits out at Modi and YS Jagan governments RMA
Author
First Published Nov 9, 2023, 3:47 AM IST

APCC president Gidugu Rudra Raju: రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయ‌ని పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క‌ర్నూలు లో నిర్వహించిన రైతు గర్జన ర్యాలీలో రుద్రరాజు ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు ఆ పార్టీ నేతలు పల్నాడు, గుంటూరు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పర్యటించారని అన్నారు. కాంగ్రెస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ జిల్లా కలెక్టరేట్ వద్ద ముగిసింది. వర్షాకాలంలో సరైన వర్షాలు కురవకపోవడం, నీటి వసతి లేకపోవడంతో దాదాపు అన్ని పంటలు ఎండిపోయాయని అన్నారు. 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు సాయం చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 685 మండలాలు ఉన్నాయనీ, దాదాపు అన్ని మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం 103 మండలాలను మాత్రమే కరువు పీడిత ప్రాంతాలుగా ఎందుకు ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్రంలోని 449 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నివేదికను పూర్తిగా విస్మరించాయని రుద్రరాజు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పంట నష్టానికి ఎకరాకు రూ.50 వేల సాయం అందించాల‌ని పేర్కొంది.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా వర్షాలు పుష్కలంగా కురిశాయన్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం తగ్గిందనీ, దీంతో రైతులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని అన్నారు. "కాలువల కింద సాగు చేసిన పంటలు సైతం ఎండిపోయాయి. రాష్ట్రంలో రైతులు పెద్దఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వడ్డీ వ్యాపారులు, ఇతర మార్గాల నుంచి తీసుకున్న అప్పులు తీర్చే క్రమంలో రైతులు జీవనోపాధి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారని" ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పించి వలసలను ఆపాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించిందని రఘువీరా అన్నారు. అయితే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రాజెక్టులపై దృష్టి సారించలేకపోయింది. పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేసి రైతుల అవసరాలు తీర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో ఏపీసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్‌, జేడీ శీలం, మాజీ ఎంపీ చింతామోహన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎన్ తుల‌సిరెడ్డి, పార్టీ నాయకులు తాంతియా కుమారి, కర్నూలు, నంద్యాల జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు బాబూరావు, లక్ష్మీ నరసింహ యాదవ్‌, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios