బట్టబయలైన రుషికొండ విల్లాల రహస్యం
విశాఖలోని రుషికొండపై నిర్మించిన విశాలమైన భవనాల రహస్యం బట్టబయలైంది. గత ప్రభుత్వం సందర్శకులు, మీడియా, ప్రతిపక్ష నేతలను ఎవరినీ అనుమతించకుండా రహస్యంగా ప్రారంభించిన ఈ భవనాలు ఇప్పుడు ఓపెన్ అయిపోయాయి.
గత జగన్ ప్రభుత్వంపై అనుమానాలు, వివాదాలు చెలరేగడానికి కారణమైన వాటిలో విశాఖ రుషికొండ ఒకటి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండను బోడిగుండు కొట్టడమే కాకుండా అక్కడ రహస్యంగా విలాసవంతమైన భవనాలు నిర్మించడం, ఆ భవనాల ప్రారంభోత్సవం కూడా రహస్యంగా చేయడం కూడా వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు ఈ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి.
వైసీపీ ప్రభుత్వం రుషికొండపై గతంలో ఉన్న భవనాలను కొన్నిటిని కూల్చేసి.. మరిన్ని విలాసవంతమైన భవనాలను నిర్మించింది. తొలుత ఇవి టూరిజం కోసమని చెప్పారు. ఆ తర్వాత పరిపాలన భవనాల కోసం వినియోగిస్తామని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వం.. అక్కడి నుంచి పరిపాలన సాగించాలని ప్రయత్నించింది. ఒకానోక దశలో సీఎం కార్యాలయాలు, అధికారుల భవనాల కోసం పరిశీలన కూడా జరిపింది. ఆ సమయంలో రుషికొండపై ఉన్న విలాసవంతమైన భవనాలు సీఎం కార్యాలయాలకు అనువుగా ఉంటాయని అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం నివేదిక కూడా ఇచ్చింది. అయితే, రాజధాని తరలింపు ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఐదేళ్లపాటు వివాదాస్పదంగా మారిన రుషికొండ భవనాలను మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక నాయకులతో కలిసి రుషికొండ భవనంలోకి వెళ్లారు. ఈ భవనంలో ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నీచర్‌ను పరిశీలించారు. సుమారు రూ.500 కోట్లతో నిర్మాణం చేపట్టారని తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తారని గత ప్రభుత్వ హయాంలో ప్రచారం చేశారని... రుషికొండ భవనం నిర్మాణ అంచనాలను రహస్యంగా ఉంచారని గుర్తుచేశారు. ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను అనుమతులు లేవనే కారణంతో కూల్చివేసిన గత జగన్ సర్కార్... రుషికొండ భవనానికి ఏ అనుమతులు ఉన్నాయని ప్రశ్నించారు. ఎవరినీ అనుమతించకుండా గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి ఈ భవనాలను ప్రారంభించారన్న గంటా శ్రీనివాసరావు... ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు నిర్మించారని నిలదీశారు.
ఇప్పుడు రుషికొండ భవనాల పరిస్థితేంటి..?
రుషికొండపై ప్రకృతి విధ్వంసం, భవనాల నిర్మాణాలు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి. నారా లోకేశ్ అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుషికొండ భవనాలను ప్రజా భవన్‌గా మారుస్తామని ప్రకటించారు. తాడేపల్లిలో చాలదన్నట్లు విశాఖలో రూ.500కోట్లతో జగన్ విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నాడని... ప్రజాధనంతో ప్రకృతిని నాశనం చేసి ప్యాలెస్ ఏర్పాటుచేసుకున్నాడని గతంలో విమర్శలు గుప్పించారు నారా లోకేశ్.
అయితే తాజాగా భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. త్వరలోనే రుషికొండ భవనాలపై నిర్ణయం తీసుకోనుంది. వైసీపీ గెలిస్తే రాజధాని విశాఖకు తరలివెళ్లేది. రుషికొండపై భవనాలు జగన్ ప్యాలస్‌లుగా మారేవి. అందుకోసమే వాటిని అంత లగ్జరీగా నిర్మించారట... మరి వీటిని టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎలా వాడుకుంటుందో..? చూడాలి.
తెలంగాణలోనూ కేసీఆర్ ప్రగతిభవన్‌ను చాలా లగ్జరీగా కట్టించుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చింది. మరి లోకేశ్ చెప్పినట్లుగా రుషికొండ భవనాలను ప్రజా భవన్‌గా మారుస్తారో లేదో చూడాలి. ఇదే జరిగితే శిష్యుడు రేవంత్ రెడ్డిని గురువు చంద్రబాబు ఫాలో అయినట్లే.