అమరావతి: ఈనెల 13 నుంచి సమ్మెబాట పట్టనున్న ఆర్టీసీ కార్మిక సంఘాలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైయస్ జగన్ త్వరలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్న నేపథ్యంలో సమ్మె ఎందుకంటూ ప్రశ్నించారు. 

ఆర్టీసీ పరిరక్షణకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ బలోపేతానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి బలోపేతం చేస్తారని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు. 

మెుదటి కేబినెట్లోనే సీఎం వైయస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రకటన చేస్తారని తెలిపారు. మాట ఇస్తే మడమ తప్పని వ్యక్తి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. 

అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని యూనియన్లు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సమ్మెకు ఏ ఆర్టీసీ కార్మికుడు సహకరించరని తెలిపారు. 

జేఏసీలో వైయస్ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాస్త టైం ఇవ్వాల్సిన అవసరం ఉందని అలా కాకుండా మసిపూసి మారేడు కాయ చేసినట్లు సమ్మెకు పిలుపునివ్వడం శోచనీయమన్నారు. కార్మికుడు ఎవరూ ఈ సమ్మెకు సహకరించరని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. 

సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ల నుంచి వైయస్ఆర్ సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ బయటకు వస్తుందన్నారు. వైసీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ను బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.