అడుగడుగునా అవమానాలే

అడుగడుగునా అవమానాలే

పాపం ఉపముఖ్యమంత్రులు. ఇద్దరినీ చూస్తుంటే అందరికీ అయ్యోపాపం అనిపిస్తోంది. ఇద్దరికీ చేతిలో ఒక్క అధికారం లేదు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. పేరుకు మాత్రం కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలు ఉపముఖ్యమంత్రులు. ప్రోటోకాల్ కు మాత్రమే పదవులు ఉపయోగపడుతున్నాయి వీరిద్దరికీ. తాజా సంఘటనతో హోంమంత్రి విషయంలో ఆ ముచ్చట కూడా నామమాత్రమేనని తేలిపోయింది.

విషయం ఏమిటంటే, ఫోరెన్సిక్ ల్యాబ్ భవనానికి చంద్రబాబునాయుడు శంకుస్ధాపన చేసారు. అయితే,  ఈ  కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కనబడలేదు. దాంతో చంద్రబాబు హోంమంత్రి గురించి వాకాబు చేసారు. తర్వాత నేరుగా నిమ్మకాయలతోనే మాట్లాడారు. దాంతో అసలు విషయం తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ శుంకుస్ధాపనకు హోంమంత్రికి అందాల్సిన రీతిలో ఆహ్వానం అందలేదట. దాన్ని అవమానంగా భావించిన నిమ్మకాయల అసలు కార్యక్రమానికే గైర్హాజరయ్యారు.

నిమ్మకాయల హోంమంత్రే కానీ ఏ అధికారినీ బదలీ చేసే అవకాశం లేదు. సహచర మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలెవరైనా సిఫారసు చేసినా బదిలీలు, పోస్టింగులు వేయించే అధికారం కూడా లేదు. ప్రతిదీ చంద్రబాబు లేకపోతే లోకేష్ చెప్పాల్సిందేనట. వీళ్ళిద్దరూ కాకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పాల్సిందే. సచివాలయంకు వచ్చే పోలీసుఉన్నతాధికారులు కూడా పెద్దబాబు, చిన్నబాబులను కలిసి వెళ్ళిపోవటమేనట. నిమ్మకాయలను కలవటం చాలా అరుదే. అధికారాలు లేని మంత్రిపదవి ఎందుకనే నిర్వేదంలో నిమ్మకాలయ చాలాకాలంగా ఉన్నట్లున్నారు. తనలో పేరుకుపోయిన అసంతృప్తిని బయటపెట్టటానికి నిమ్మకాయల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాడుకున్నారు.

ఇక,  రెవిన్యూశాఖ మంత్రి,  ఇంకో ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తిది మరో కథ. రెవిన్యూశాఖ మంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాత అంతటి పవర్ ఫుల్లు పోస్టు. కానీ కెఇ మాత్రం కేవలం  డమ్మీనే. కలెక్టర్ల బదిలీలో ఎటూ పాత్ర ఉండదు. కనీసం జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓల పోస్టింగులు, బదిలీల్లో కూడా కెఇ పాత్ర ఎక్కడా ఉండదు. వివిధ అవసరాలకు జరుగుతున్న భూసేకరణలో కూడా కెఇ పాత్ర చాలా పరిమితమే. రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణలో అయితే అసలు కెఇకి సంబంధమే లేదు. భూ సేకరణతో ఎటువంటి సంబంధమూ లేని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతోనే చేయిస్తున్నారు చంద్రబాబు.

ఇక శాఖాపరమైన విషయాలు చూస్తే రెవిన్యూశాఖలో అవినీతి బాగా పెరిగిపోయిందంటూ వేదికల మీదే అదికూడా కెఇ పక్కనుండగానే ముఖ్యమంత్రి ఎన్నోమార్లు అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నిజంగానే రెవిన్యూశాఖలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దాని పర్యవసరామే కెఇకి అవమానాలు. మొత్తానికి ఇద్దరూ పేరుకుమాత్రమే ఉపముఖ్యమంత్రులని తేలిపోయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos